Jagan: జగన్ కు కఠిన పరీక్ష

నిండు సభలో చంద్రబాబు శపథం చేశారు. తనకు ఎదురైన అవమానాలతో మళ్లీ సీఎం గానే హౌస్ లో అడుగు పెడతానని చంద్రబాబు ప్రతినబూనారు. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ఆయన గౌరవంగా శాసనసభలో అడుగుపెట్టనున్నారు.

Written By: Dharma, Updated On : June 15, 2024 4:45 pm

Jagan

Follow us on

Jagan: ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సొంతం చేసుకుంది. దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. 175 నియోజకవర్గాలకు గాను 166 చోట్ల విజయం సాధించింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరగా.. ఓటమిపై సమీక్షలు చేస్తున్నారు జగన్. ఇటువంటి తరుణంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది ఆయనకు. ఈనెల 18న మంత్రివర్గ సమావేశం జరగనుంది. 19న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

నిండు సభలో చంద్రబాబు శపథం చేశారు. తనకు ఎదురైన అవమానాలతో మళ్లీ సీఎం గానే హౌస్ లో అడుగు పెడతానని చంద్రబాబు ప్రతినబూనారు. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ఆయన గౌరవంగా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. అదే సమయంలో జగన్ సైతం శాసనసభలో ఒక సామాన్య ఎమ్మెల్యేగా అడుగుపెడతారు. వైసిపి అధినేతగా ఉన్నా.. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అది స్పీకర్ విచక్షణ అధికారం పై ఆధారపడి ఉంది. ఇప్పటికే 21 స్థానాలను గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. కానీ టిడిపి తో పొత్తు పెట్టుకుని విజయం సాధించడంతో.. ప్రతిపక్ష హోదా తీసుకునే పరిస్థితి లేదు. అలాగని వైసిపి ఆ అర్హత సాధించలేదు.

సాధారణంగా విపక్షాలకు, విపక్ష నేతకు అధికారపక్షంతో సమానంగా సీట్లు కేటాయిస్తారు. ఒకవైపు విపక్ష నేతకు ముందు వరుసలో సీటు ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు జగన్ కు ముందు వరుసలో సీటు అనుమానమే. ఇంటి పేరుతో వచ్చే అక్షర క్రమంలో సీటు ఏర్పాటు చేస్తే చివరిలోకి వెళ్తారు. అదే పేరును పరిగణలోకి తీసుకుంటే మధ్యలో ఏర్పాటు చేస్తారు. ఇలా ఎలా చూసుకున్నా జగన్ కు అవమానం ఎదురయ్యే అవకాశాలే అధికం. 2014లో 67 సీట్లును గెలుచుకొని గౌరవప్రదంగా విపక్షనేతగా వ్యవహరించారు. 2019లో 151 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రాగలిగారు. ముఖ్యమంత్రిగా గౌరవించబడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. స్పీకర్ విచక్షణాధికారం పైనే ఆయన గౌరవం ఆధారపడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కు ఇది ఒక పరీక్షా కాలం.