Sambasiva Rao: కొన్ని సందర్భాల్లో పాత్రికేయులు తమ లైన్ దాటి మాట్లాడుతుంటారు. ఆవేశాన్ని వ్యక్తం చేస్తుంటారు. తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఆ సమయంలో తాము పాత్రికేయులమని.. అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి.. సాధారణ పౌరుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అరుదైన సందర్భంలో మాత్రమే పాత్రికేయులు ఇలా వ్యవహరిస్తుంటారు. అయితే ఇలా నిత్యం ప్రవర్తించే పాత్రికేయులలో సాంబశివరావు ముందుంటారు.
టీవీ5 ఛానల్ లో పనిచేసే ఆయన.. ఏ విషయాన్నీ కూడా దాచుకోరు. ప్రతిదానిని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. అందువల్లే ఆయన నిర్వహించే టాప్ స్టోరీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. పైగా ఆయన మాట్లాడే విధానం కూడా స్పష్టంగా ఉంటుంది. ఛానల్ లైన్ ఎలా ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం జాతీయవాదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా విమర్శలకు తావు ఇవ్వకుండా తనలో ఉన్న జాతీయ తత్వాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడి పై సాంబశివరావు నోరు పారేసుకున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకానొక దశలో డబ్బా రేకుల ట్రంప్ రాయుడు అని ఆరోపించారు..” నువ్వు ఫోన్ చేస్తే మేం భయపడిపోయామా.. నువ్వు చెబితే పాకిస్తాన్ మీద యుద్ధం ఆపేశామా.. నువ్వు సుంకాలు విధిస్తే మేము వ్యాపారం చేయకుండా ఉండిపోవాలా.. నువ్వు ఆదేశాలు జారీ చేస్తే భయపడి పోవాలా.. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి.. అదిరిస్తే వణికి పోవడానికి ఇదేమి పాకిస్తాన్ కాదు.. భారతదేశం.. మాకు మోడీ ఉన్నాడు. అన్ని చూసుకుంటాడు.. నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదనుకున్నావా.. మా జిడిపి అంతకంతకు పెరుగుతోంది.. డెత్ ఎకానమీ అనడానికి నీకు ఎన్ని గుండెలు.. డబ్బా రేకుల ట్రంప్ రాయుడు … నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు” ఇదిగో ఇలా సాగిపోయింది సాంబశివరావు ఆగ్రహం.
వాస్తవానికి కొద్ది రోజులుగా భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు ఇబ్బంది పెడుతున్నాడు. తన పిచ్చి పిచ్చి నిర్ణయాలతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మన దేశ ఆర్థిక రంగంపై తీవ్రస్థాయిలో దెబ్బ కొట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. అయినప్పటికీ భారత్ స్థిరంగానే ఉంది. పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతోంది. ఇదే విషయాన్ని సాంబశివరావు ఓపెన్ గానే చెప్పేశాడు. పైగా నరేంద్ర మోడీకి అవుట్రైట్ గా మద్దతు తెలియజేశాడు. వాస్తవానికి పాత్రికేయులు ఇలా మాట్లాడడం సాధ్యం కాదు. కానీ ఆ లైన్ మొత్తం సాంబశివరావు దాటేశాడు. ప్రస్తుతం టిడిపి కూటమిలో ఉంది కాబట్టి సాంబశివరావు ఇలా మాట్లాడాడా? లేక ఆయన వ్యక్తిత్వమే ఇలా ఉంటుందా… ఈ ప్రశ్నలపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.