Top News channels ban in AP : మీడియా రంగం కలుషితం అయింది.ఇప్పుడు మీడియా రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారిపోయింది.మీడియాలో ప్యాకేజీల పర్వం నడుస్తోంది.ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా..కొత్త పుంతలు తొక్కింది. అంతవరకు ఓకే కానీ.. వాటి నిర్వహణ కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీపై ఆధారపడక తప్పలేదు.ఏపీలో సైతం మీడియా విభజన జరిగిపోయింది. టిడిపికి అనుకూలంగా వ్యవహరించే మీడియాను ఎల్లో మీడియా గాను.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేది నీలి మీడియా గాను..అవసరాలకు తగ్గట్టు నడుచుకునేవి తటస్థ మీడియా గాను విభజనకు గురయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు మాదిరిగా.. ప్రభుత్వానికి, పాలకుల ఆగ్రహానికి మీడియా బాధితురాలిగా మిగులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఫలానా మీడియాను.. టిడిపి అధికారంలోకి వస్తే ఫలానా మీడియాను నిషేధిస్తారు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ వంటి వాటిని నిషేధించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది అధికారికంగా నిషేధించకపోయినా.. కేబుల్ ఆపరేటర్ల ద్వారా వాటిని నియంత్రించే ప్రయత్నం చేశారన్నది వాస్తవం. అప్పట్లో బాధిత మీడియాతో పాటు టిడిపి సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసిపి అనుకూల మీడియాపై నిషేధం విధిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ పై అనధికార నిషేధం నడుస్తుందని.. కేబుల్ ఆపరేటర్ల ద్వారా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
* వైసీపీ ట్వీట్ వైరల్
వైసిపి తాజాగా ఒక ట్వీట్ పెట్టింది. రాష్ట్రంలో మూడు మీడియా ఛానళ్లను నిషేధించారని ఆరోపిస్తోంది. తన అధికారిక ట్విట్టర్లో ఓ పోస్టు వైరల్ గా మారుతోంది.’ సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే మీడియాను అణచివేస్తున్నారు. అధికార దుర్వినియోగం, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు టీవీ ఛానల్ పై కక్ష కట్టారు. తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన సాక్షి టీవీ, ఎన్ టీవీ, టీవీ9 న్యూస్ ఛానల్ లపై చంద్రబాబు కత్తి కట్టారు. రాష్ట్రంలో ఎక్కడ ఈ చానళ్లు ప్రసారం కాకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేబుల్ ఆపరేటర్లు ఆయా ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. అక్కడ నుంచే ఈ ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా సహా మరికొందరు అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. ఏపీలో రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తుందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ’ అంటూ వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* అప్పట్లో అనధికార ఆంక్షలు
వైసిపి ప్రభుత్వ హయాంలో సైతం ఓ మూడు మీడియా ఛానల్ లపై ఇదేవిధంగా అనధికార ఆంక్షలు కొనసాగాయి. అయితే అప్పట్లో సదరు బాధిత మీడియా ఛానళ్లు పెద్ద యుద్ధమే చేశాయి. అయితే అధికారం ఎట్టుంటే అటువైపు మీడియా దూకడం పరిపాటిగా మారింది. అప్పట్లో బాధిత మీడియా తరఫున గొంతు చించుకున్న టిడిపి.. ఇప్పుడు అధికారంలో ఉంది. ఒకవేళ వైసీపీ ఆరోపిస్తున్నట్టు అనధికార ఆంక్షలు కొనసాగిస్తే మాత్రం అది ముమ్మాటికీ తప్పే. వైసీపీ చేసిన తప్పులకు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అదే తప్పు టిడిపి చేస్తే మాత్రం మూల్యం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Top news channels tv9 ntv sakshi broadcasting banned by cable operators in andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com