Visakha YCP : విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి టులెట్ బోర్డు

అయితే పాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ లాంటి నగరానికి ఓ ద్వితీయ శ్రేణి నాయకుడ్ని పార్టీ అధ్యక్ష పీఠం అప్పగించడం అంటే లోటే. అందుకే వైవీ సుబ్బారెడ్డి తటపటాయిస్తున్నారు. 

Written By: Dharma, Updated On : July 18, 2023 6:13 pm
Follow us on

Visakha YCP : విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి టులెట్ బోర్డు పెట్టారు. పార్టీ పదవి తీసుకోండని హై కమాండ్ కోరుతుంటే మాకొద్దు బాబోయ్ అంటూ నేతలు పక్కకి తప్పుకుంటున్నారు. మరికొందరైతే తీసుకుంటాం… మరి మాకేంటి అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు పార్టీకి, పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు సరైన వ్యక్తి కోసం వైవీ సుబ్బారెడ్డి అన్వేషిస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా షరతులు వర్తిస్తాయని చెబుతుండడంతో వైవీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో చివరకు ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు పరిశీలించాల్సి వస్తోంది.

పంచకర్ల రమేష్.. ఇలా వెళ్లారో లేదో వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. నేతల పేర్లు స్క్రూట్నీ చేసి తన ముందు పెట్టుకున్నారు. తొలుత ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ను పిలిచారు. పార్టీ అధ్యక్ష పదవికి నువ్వే సమర్థుడివి అంటూ చెప్పుకొచ్చారు. అన్న నేను అల్ రెడీ ఎనిమిదేళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాను. నాకు ఇంటరెస్ట్ లేదన్నా అంటూ వైవీ ముఖం మీద చెప్పేశారు. అటు తరువాత మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ను పిలిచి మాట్లాడారు. అధ్యక్ష పీఠం తీసుకోవాలని కోరారు. అయితే ఎమ్మెల్యేతో పాటు పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షుడిగా పోటీచేశానని… వచ్చే ఎన్నికల్లో ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో అవకాశమిస్తే తీసుకుంటానని కండీషన్ పెట్టారు. దీంతో వైవీ సైలెంట్ అయ్యారు.

పోనీ మైనార్టీ నాయకుడికి ఇద్దామని వైవీ ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ ను పిలిపించారు. అయితే ఆయన ఏకంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టిక్కెట్ ను అడిగేశారు. తరువాత గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డిని లైన్ లో పెట్టారు. ఆయనదీ అదే మాట. దీంతో ఏం చేయాలో వైవీ సుబ్బారెడ్డికి పాలుపోవడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు అంటే తన చేతిలో పనికాదని తేల్చేశారు. ఎలాగోలా పార్టీని నడుపుకోవడానికి డిసైడయ్యారు.

ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న బెహర భాస్కరరావు, గాంధీల్లో ఎవరో ఒకరు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేలా మంతనాలు జరుపుతున్నారు. అయితే ఏదో పార్టీ పదవితో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆరాటంలో ఉన్న ఇద్దరు నాయకులు కార్యాలయ నిర్వహణ ఖర్చును సైతం పెట్టుకునేందుకు ముందుకొస్తున్నారు. అయితే పాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ లాంటి నగరానికి ఓ ద్వితీయ శ్రేణి నాయకుడ్ని పార్టీ అధ్యక్ష పీఠం అప్పగించడం అంటే లోటే. అందుకే వైవీ సుబ్బారెడ్డి తటపటాయిస్తున్నారు.