BJP – TDP : తెలుగుదేశం పార్టీని బీజేపీ దూరం పెట్టిందా? లేకుంటే టీడీపీయే బీజేపీకి దూరం జరిగిందా? అసలేం జరుగుతోంది? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రబాబుకు పిలవలేదు ఎందుకు? పవన్ ను మాత్రమే ఎందుకు పిలిచినట్టు? ఢిల్లీ వెళ్లిన పవన్ ఏపీలో పొత్తులు ఉంటాయని ఎందుకు ప్రకటన చేసినట్టు? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఇంతటి కన్ఫ్యూజన్ కు కారణమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇదంతా వ్యూహాత్మకమా? లేక ప్రత్యర్థుల ఊహకు అందని రాజకీయమా? అన్నది తేలాల్సి ఉంది.
మొన్నటికి మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి వచ్చారు. పొత్తులు దిశగా సంకేతాలిచ్చారు. మున్ముందు మరిన్ని సమావేశాలు నిర్వహించుకొని క్లారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ సమావేశమయ్యేందుకు అవకాశం వచ్చినా చంద్రబాబును ఎందుకు పిలవలేదు. పూర్వాశ్రమంలో ఎన్డీఏలో పనిచేసినా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అన్నదే అందరి సంశయం. అయితే ఇందులో వ్యూహాత్మక ఎత్తుగడ దాగి ఉందా? లేకుంటే టీడీపీని తప్పించి జనసేనను ఒప్పించడమా? కానీ దీనిపై బీజేపీ నాయకులెవరూ మాట్లాడడం లేదు. అలాగని ఆహ్వానం అందలేదని టీడీపీ నేతలు బయటపడడం లేదు.
అయితే బీజేపీని కలుపుకొని వెళదామన్న మునుపటి ఉత్సాహం చంద్రబాబులో కనిపించడం లేదు. బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న ప్రచారంతో ఆయన అచీతూచీ అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైసీపీని ఎదుర్కొనేందుకు బీజేపీ మద్దతు వుంటే బాగుంటుందనే అభిప్రాయం చంద్రబాబులో వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కార్ తీరని అన్యాయం చేసిందనే భావన ప్రజానీకంలో వుంది. అందుకే బీజేపీతో అంటకాగిన పార్టీకి జనం వాతలు పెడ్తారనే భయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు టీడీపీ తనకు తానుగా బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, ప్రస్తుతానికి ఆ పార్టీ దూరం పెడుతోంది. అయితే అది కూడా తమకు మేలేనన్న రీతిలో చంద్రబాబు అండ్ కో ఉన్నారు. ఢిల్లీలో జరిగే పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు.