Tomato Prices: దసరా ( Dussehra festival) సమీపిస్తోంది. కూరగాయలతో పాటు నిత్యవసరాల అమ్మకాలు పెరిగాయి. వాటి ధరలు చూస్తుంటే మాత్రం మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర పాతిక రూపాయల కు పైగానే ఉంది. కానీ ఏపీలో ఆ ప్రాంతాల్లో మాత్రం కిలో 50 పైసలకే దొరుకుతుంది. రూపాయి ఇస్తామంటే రైతులు ఎగబడి ముందుకు వచ్చి అమ్ముతున్నారు. అయితే ధరల స్థిరీకరణ లేకపోవడం, యంత్రాంగం ముందు చూపు లేకపోవడం వంటి కారణాలతో పంట లభ్యమయ్యే చోట తక్కువ ధర పలుకుతోంది. ఇతర ప్రాంతాల్లో మాత్రం అందనంత దూరంలో ఉంది. దీంతో టమాటా రైతు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.
* కర్నూలు మార్కెట్లో నిరసన..
ఏపీలో( Andhra Pradesh) టమాటా పంటకు పెట్టింది పేరు కర్నూలు జిల్లా. జిల్లా వ్యాప్తంగా విరివిగా పండుతుంది టమాట. ప్రస్తుతం పంట అందుబాటులోకి వచ్చింది. దిగుబడి బాగా ఉంది. కానీ ధర మాత్రం పూర్తిగా పడిపోయింది. కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. అయితే ధర విషయంలో చేదు అనుభవం ఎదురు కావడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మార్కెట్లో పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టమాటా విక్రయాలు జరపకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. దీంతో కర్నూలు మార్కెట్లో టన్నులకు టన్నుల టమాటా వృధాగా కనిపిస్తోంది.
* శ్రమకు తగ్గ ఫలితం ఏది?
ఆరుగాళం కష్టపడే రైతుకు శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. ఈ క్రమంలో పంటలు పండించి అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కిలో టమాట పాతిక రూపాయల పై మాటే. కానీ కర్నూలు జిల్లాలో( Kurnool district) రైతులు వద్ద టమాటా రూపాయికి కూడా అడగడం లేదు. ఇలా ధరల స్థిరీకరణ లేకపోవడంతో నష్టపోవడం రైతుల వంతు అవుతోంది. కనీసం గ్రామం నుంచి మార్కెట్ కు తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అటువంటప్పుడు పంట సేకరణ ఎందుకు చేయాలని కొందరు.. తెచ్చిన పంటను రహదారుల పక్కనే పారేస్తున్నారు మరి కొందరు. మార్కెట్కు తీసుకువచ్చినవారు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతుండడంతో.. తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. మార్కెట్లో టమాటా పారబోసి నిరసన తెలుపుతున్నారు.