Janasena Second List: జనసేన అభ్యర్థుల విషయంలో పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రెండో జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రానికి పది మందితో జాబితా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. తాజాగా మరో 10 మందిని ఎంపిక చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి పేర్లను ఈరోజు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో జనసేన ప్రాతినిధ్యం ఉండేలా పవన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
నిన్న రోజంతా పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పోటీ చేసే అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో పరిస్థితి, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించారు. రాజోలు ఎస్సీ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరును ఖరారు చేశారు. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు సమాచారం. ఉంగటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరంలో పులపర్తి రామాంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లాంఛన మేనని తేలుతోంది. తిరుపతి సీటుపై తీవ్ర తర్జన భర్జన జరుగుతోంది. జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైపు పవన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పవన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తాజాగా పదిమంది అభ్యర్థులను ప్రకటిస్తే.. ఇంకా ఆరు స్థానాలు పెండింగ్ లో ఉంటాయి. మరోవైపు ఎంపీ స్థానాలకు సంబంధించి జనసేనకు రెండింటిని కేటాయించారు. మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా తేలింది. అటు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పవన్ జనసేన అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. ముందుగా సానా సతీష్ పేరు వినిపించింది. అయితే కేంద్ర పెద్దలు పవన్ కు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దానిపై కూడా ఈరోజు పవన్ క్లారిటీ అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే జనసేన అభ్యర్థులు దాదాపు ఈరోజుతో సగానికి పైగా ఖరారు అవుతారని తెలుస్తోంది.