CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానానికి సముద్రం ముప్పు.. చంద్రబాబు దృష్టికి వ్యవహారం

మహారాష్ట్రలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబై ప్రాంతంలోని ఉల్వే తీరంలో తాత్కాలిక కాస్టింగ్ యార్డు నుంచి 40 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 10:51 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం, పచ్చ తోరణం గా ఈ క్షేత్రం భాసిల్లుతూ ఉంటుంది. ఈ దేవస్థానం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్నారు. అయితే ఈ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ఓ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం వివాదంలో చిక్కుకుంది. ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో.. ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

మహారాష్ట్రలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబై ప్రాంతంలోని ఉల్వే తీరంలో తాత్కాలిక కాస్టింగ్ యార్డు నుంచి 40 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. గతంలో ఇది ఫిషింగ్ జోన్ గా ఉండేది.. అయితే దీనిపై నాన్ కనెక్ట్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ” అరేబియా సముద్ర తీరంలో భారీ ఆలయాన్ని నిర్మించడం మంచిదేనా? సముద్ర మట్టాలు పెరుగుతాయని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇది తీర ప్రాంతాలకు ప్రమాదకరంగా ఉంటుంది. ప్రాజెక్టు స్థలం ఎత్తు పెంచేందుకు భూ సేకరణ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతాయని” నాన్ కనెక్ట్ ఫౌండేషన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపిన ఈమెయిల్ లో ఆందోళన వ్యక్తం చేసింది.. మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన అధికారిక మ్యాప్ లో ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం వరద ముంపు ప్రాంతంలో ఉందని నాట్ కనెక్ట్ డైరెక్టర్ బీ. ఎన్ కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు పంపిన ఈ మెయిల్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆలయం నిర్మించే ప్రాంతం పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన జోన్ లో ఉందని తెలుస్తోంది..” చంద్రబాబు నాయుడికి ఒక ఈమెయిల్ పంపించాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నామని” కుమార్ పేర్కొన్నారు.. నాన్ కనెక్ట్ ఫౌండేషన్ లేదా ఇతర పర్యావరణవేత్తలు ఎవరూ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని, భూమి కొరత లేని నవి ముంబైలో పర్యావరణహితమైన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించవచ్చని కుమార్ పేర్కొన్నారు..

నవీ ముంబై ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి పూర్వం ఫిషింగ్ యార్డ్ గా ఉండేది. ఆ ప్రాంతం అత్యంత బురదమయంగా ఉండేది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గానూ కాస్టింగ్ యార్డ్ స్థలాన్ని 2018- 19 సంవత్సరంలో కేటాయించారు. అంతకుముందు ఆ స్థలంలో ఉన్న ఫిషింగ్ యార్డును మరోచోటికి తరలించలేదు. దీంతో చాలామంది మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆలయ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని ఎందుకు ఎంపిక చేశారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే విషయాలను తిరుమల తిరుపతి దేవస్థానం బయటికి చెప్పడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, భారతదేశ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించింది. ఎక్కడా రాని వివాదం.. నవీ ముంబై ప్రాంతంలో తలెత్తడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు మహారాష్ట్ర కోస్టింగ్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ.. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించే సమయంలో.. కాస్టింగ్ యార్డ్ ను పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాస్టింగ్ యార్డ్ స్థలాన్ని కేటాయించే సమయంలో స్థానిక మత్స్యకారుల అభిప్రాయాలను మహారాష్ట్ర కోస్టింగ్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ తీసుకోలేదు. అప్పట్లో ఈ ప్రాంతంలో అటల్ సేతు నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించుకోవచ్చని మత్స్యకారులు భావించారు. అయితే దీనిపై మహారాష్ట్ర కోస్టింగ్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు నాన్ కనెక్ట్ ఫౌండేషన్ నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి లేఖ రాయడంతో స్థానిక మత్స్యకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆయన తమకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఇక్కడి మత్స్యకారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ స్థలాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ నాన్ కనెక్ట్ ఫౌండేషన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసింది.