Tirumala Online Game App Controversy: స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా వస్తూ ఉంటారు. అందువల్లే తిరుమల క్షేత్రం ప్రతిరోజు వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక స్వామివారికి జరిగే పూజలు, అన్నప్రసాద నివేదనలు, కోలాటాలు, భక్తబృందభజనలు నిత్య కృత్యంగా సాగుతూనే ఉంటాయి. అందువల్లే తిరుమల శోభాయ మానంగా కనిపిస్తూ ఉంటుంది. ఏడుకొండల పచ్చదనం.. స్వామివారి తేజోమయ రూపం తిరుమలను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లేలా చేస్తోంది. తిరుమల తిరుపతి ఎంత గొప్ప క్షేత్రమో.. వివిధ రకాల వివాదాలతోనూ అంతే పేరు తెచ్చుకుంది. గత ఏడాది స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడిన పదార్థాలకు సంబంధించి జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. చివరికి దీనిపై ప్రభుత్వం ఒక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో విచారణ జరుగుతున్నది. ఇక ఇటీవల కాలంలో వైకుంఠ దర్శనానికి సంబంధించి టికెట్ల కేటాయింపులో జరిగిన తొక్కిసలాట వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో గాయపడ్డారు.. ఇప్పుడు ఈ వివాదాలు మొత్తం సమసిపోయాయి. తిరుమల క్షేత్రంలో భక్తులకు స్వామివారి దర్శనం సాఫీగా జరిగిపోతుంది. అయితే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆవివాదం తిరుమల తిరుపతిలో చోటుచేసుకుంది కాదు. అధికారుల తప్పిదం వల్ల జరిగింది అంతకన్నా కాదు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ క్షేత్రాన్ని జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే భక్తులు కోట్ల మంది ఉంటారు. అయితే కోట్ల మంది భక్తిని ఆసరాగా తీసుకున్న ఓ కంపెనీ ఏకంగా ఒక గేమింగ్ యాప్ డెవలప్ చేసింది. అందులో శ్రీవారికి అదే ఆర్జిత సేవలు, లడ్డు ప్రసాదం లభించే చోటు, స్వామి వారికి సంబంధించిన విభాగాల అన్నింటికీ సంబంధించిన వివరాలను ఆ యాప్ లో పొందుపరిచారు. అంతేకాదు హుండి పేరుతో వర్చువల్ కరెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇదంతా నిజమేనని భావించిన చాలామంది భక్తులు హుండీలో వర్చువల్ కరెన్సీని వేస్తున్నారు. అయితే ఆ వర్చువల్ కరెన్సీ పొందాలి అంటే యాప్ నిర్వాహకులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వర్చువల్ కరెన్సీ పేరుతో ఈ యాప్ నిర్వాహకులు భారీగా దండుకున్నారు. అయితే కొంతమంది భక్తులు ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఈ గేమింగ్ యాప్ పై అధికారులు దృష్టి సారించారు. నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. గూగుల్ డొమైన్ నుంచి దీనిని తొలగించాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ” స్వామి వారికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇలా పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదు. అది స్వామివారికి సంబంధించిన విషయం కాబట్టి.. అలాంటివి బయటికి తెలియకూడదు. లడ్డు ప్రసాదం, హుండీకి సంబంధించిన విషయాలను ఇలా స్వలాభం కోసం వాడుకోకూడదు.. దీనిని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. నిర్వాహకులు ఈ యాప్ తొలగించాలని” తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యాప్ నిర్వాకులది తమిళనాడు అని.. సదర్ కంపెనీ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంపై భక్తులు కూడా స్పందిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడొద్దని.. ఆ తర్వాత స్వామివారు చూసే చూపును తట్టుకోలేరని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.