Leopard Attack in Tirumala: తిరుమలలో( Tirumala) చిరుత కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి అలిపిరి వైపు వెళ్లే దారిలో బైక్ పై వెళుతున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. జూ పార్కు రోడ్డులో ఒక్కసారిగా చిరుత దూసుకొచ్చింది. అయితే త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ వీడియో. అలిపిరి మార్గంలో రాత్రిపూట బైక్ ప్రయాణాలు వద్దని ఇప్పటికే టీటీడీ భద్రతాధికారులు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా సరే చాలామంది బైకులపై వెళ్తున్నారు. ఈ క్రమంలో చిరుతలు హల్ చల్ సృష్టిస్తున్నాయి. సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నాయి.
తిరుమలలో రాత్రి బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నించిన చిరుత
అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డులో ఘటన
తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు pic.twitter.com/y46OmvCndj
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2025
ఒక్కసారిగా దాడి..
తిరుమల అలిపిరి మార్గంలో( aliperi route) శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వెళుతున్నాడు. కేన్సర్ ఆసుపత్రి దగ్గరకు రాగానే పొదల చాటున నక్కి ఉన్న చిరుత ఒక్కసారిగా రోడ్డులో బైక్ పై వెళుతున్న వ్యక్తిపై దూసుకు వచ్చింది. అయితే ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించడంతో పాటుగా అదృష్టవశాత్తు బైక్ పై వేగంగా వెళుతుండడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ఆ వెనుక్కునే వస్తున్న కారుకు సంబంధించిన కెమెరాలు రికార్డ్ అయింది. అయితే అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో అర్థరాత్రి సమయంలో కూడా చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తాజాగా బైక్ పై వెళుతున్న వ్యక్తిపై చిరుత దాడికి ప్రయత్నించడం మాత్రం కలకలం రేపింది. ఈ కారులో రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అటవీ జంతువుల సంచారం..
గతంలో అలిపిరి నడక దారిలో, శ్రీవారి మెట్టు( Srivari mettu) మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించేవి. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం అయ్యింది. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. చిరుతలు సంచరించిన సమయంలో భక్తులను గుంపులుగా పంపించారు. అయితే ఇప్పుడు తిరుపతి ప్రజలను చిరుతలు టెన్షన్ పెడుతున్నాయి. ఇటీవల వెంకటేశ్వర యూనివర్సిటీ తో పాటు పలు ప్రాంతాల్లో చిరుతలు సంచరించాయి. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై.. స్థానికుల్లో కొంత అవగాహన కల్పించారు. అయితే ఇటీవల సంచారం తగ్గింది కానీ.. ఇప్పుడు అలిపిరి మార్గంలో మాత్రం ఏకంగా వాహనదారులపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.