Tirumala Laddu issue : తిరుమల లడ్డు వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వివాదాస్పదంగా మారింది. లడ్డూ తయారీలో జంతు నూనె వాడారు అన్నది ప్రధానంగా వచ్చిన ఆరోపణ.గుజరాత్ లోని ఓ జాతీయస్థాయి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ నివేదికలను బయటపెట్టారు టిడిపి నేతలు. సీఎం చంద్రబాబు సైతం చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. వైసీపీ సర్కార్ టీటీడీ పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఆరోపణలు నిజమైతే.. వైసిపి ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోవడం ఖాయం. తిరుమల లడ్డూ ప్రసాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. స్వామివారి దర్శనం తర్వాత వీలైనంత ఎక్కువగా లడ్డూలను తమ వెంట తీసుకెళ్తుంటారు. అటువంటి లడ్డూ తయారీలో పంది కొవ్వు, చేప నూనె వంటి ఇతర పదార్థాలను ఉపయోగించినట్లు సంచలన విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డు గురించి వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ల్యాబ్ రిపోర్టును సైతం బహిరంగ పరిచారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది.
* భక్తుల మనోవేదన
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ఈ క్రమంలో స్వామి వారి లడ్డూ తయారీలో జంతు నూనె వాడారని వార్తలు రావడంతో భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు సైతం చేపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ సైతం కౌంటర్ అటాక్ చేస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
* హిందూ ధార్మిక సంఘాల స్పందన
మరోవైపు ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు స్పందిస్తున్నాయి.హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయ పవిత్రతను భంగం కలిగేలా జగన్ ప్రవర్తిస్తున్నారని ధార్మిక సంఘం నేతలు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ వైఖరి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించారు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయ పవిత్రతను భంగం కలిగించేలా జగన్ ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.
* గతంలోనే బిజెపి ఆరోపణలు
అయితే టీటీడీ వ్యవహారాలపై బీజేపీ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తోంది. ఆలయ పవిత్రతను మంటగలిపేలా జగన్ సర్కార్ వ్యవహరించిందని అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు రకరకాల అనుమానాలు తెరపైకి తెచ్చారు. అప్పట్లో రాజకీయ కారణాలతో పెద్దగా ఫోకస్ కాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణలతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే దీనిపై కేంద్రం సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నాటి వైసిపి ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు.