Tirumala Laddu Case: తిరుమల లడ్డూ( Tirumala laddu) వివాదానికి సంబంధించి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు చేశారు సీఎం చంద్రబాబు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిబిఐ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం మధ్యేమార్గంగా సీబీఐ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర అధికారులతో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది నెలలుగా విచారణ కొనసాగుతోంది. చాలామంది నిందితులను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తోంది. అయితే నిందితులు బెయిల్ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
* బెయిల్ పిటిషన్ డిస్మిస్
ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న ఆశిష్ అగర్వాల్( Ashish Agarwal ) నెల్లూరు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిట్ తరపున న్యాయవాది గట్టిగానే వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న భోలే బాబా డైరీ డైరెక్టర్లు తమిళ్ జైన్, విపిన్ జైన్ కు ఆశిష్ అగర్వాల్ సన్నిహితుడని పేర్కొన్నారు. తిరుమల తో పాటు ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న విషయం ఆశిష్ అగర్వాల్ కు తెలుసు అని.. వారికి పూర్తిగా సహకరించారని సిట్ న్యాయవాది చెప్పుకొచ్చారు. నకిలీ ఇన్వాయిస్ ల సృష్టికర్త కూడా ఆశిష్ అగర్వాల్ అని… రూ.146 కోట్లకు నిందితుడు నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటి ఆధారంగానే ఈ సమస్యల నుంచి తాము నెయ్యి కొనుగోలు చేసినట్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ మోసం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
* ఖాళీ లారీలను తెప్పించి
ఇటీవల వచ్చిన దృశ్యం సినిమా మాదిరిగా.. వ్యవహరించిన వైనాన్ని కూడా సిట్( special investigation team) న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ఉత్తరాఖండ్ లోని భోలే బాబా డైరీకి తమ కంపెనీల నుంచి నెయ్యి సరఫరా అయిందని రుజువు చేసేందుకు ఆశిష్ ఖాళీ లారీలను రాజస్థాన్లోని బీకానేర్, ఢిల్లీ నుంచి ఇప్పించారని వివరించారు. సిట్ బృందానికి బురిడీ కొట్టించిన విషయాన్ని కూడా కోర్టులో ప్రస్తావించారు. కుట్ర బయటపడకుండా ఉండేందుకు ఆశిష్ అగర్వాల్ చాకచక్యంగా వ్యవహరించారని.. నకిలీ ఇన్వాయిసుల్లో పేరున్న కంపెనీలకు భోలే బాబా డైరీ డైరెక్టర్లు ఆన్లైన్ ద్వారా నగదు పంపిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అటువంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే తప్పకుండా సాక్షులను ప్రభావితం చేస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంటూ కోరారు. దీంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు.