Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) విషయంలో కీలక పరిణామం. చట్టబద్ధతకు సంబంధించి కదలిక వచ్చింది. ఢిల్లీ స్థాయిలో దానిపై సంకేతాలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి ప్రాధాన్యం పెరిగింది. గతానికి భిన్నంగా కేంద్రం కూడా అమరావతికి ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చింది. నిధులతో పాటు ప్రాజెక్టుల పరంగా అండగా నిలుస్తోంది కేంద్రం. అదొక్కటే చాలదు అని రాష్ట్ర ప్రభుత్వం కోరేసరికి.. కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుతో రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ కేంద్రం ఒక నిర్ణయం వెల్లడించునుంది. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రైతులు ఆందోళనతో ఉన్నారు. వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో… శరవేగంగా పావులు కదుపుతోంది మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.
* ఏ రాష్ట్రానికి లేనిది..
అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్నది రైతుల డిమాండ్. అయితే ఏ రాష్ట్ర రాజధానికి కూడా ఇలా చేయలేదని కేంద్రం చెబుతోంది. గెజిట్ నోటిఫికేషన్( Gejit notification) ఇవ్వాలంటే ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాలి. అయితే ఎక్కడా పునర్విభజన చట్టంలో అమరావతిని రాజధానిగా చూపలేదు. ముందు చట్ట సవరణ చేసి అమరావతి రాజధానిగా గెజిట్ ఇవ్వాలి. అది జరగాలంటే పార్లమెంటులో చర్చించి ఆమోదం పొందాలి. ఇప్పటికే దీనిపై న్యాయ సమీక్ష పూర్తయింది. క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేయనుంది. అది జరిగాక పార్లమెంట్లో ఆమోదించి అమరావతికి చట్టబద్ధత ఇవ్వనున్నారు.
* ఆ పరిస్థితి రాకుండా..
అమరావతి విషయంలో వైసిపి ప్రభుత్వం ఆడిన గేమ్ తో రైతులు ఆందోళనతో ఉన్నారు. మరోసారి అటువంటిది పునరావృత్తం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. మొన్న ఆ మధ్యన తమ సమస్యలను చెప్పుకునే క్రమంలో అమరావతి రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం పై ఒత్తిడి చేశారు. అందుకే దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకుని సి ఆర్ డి ఏ అధికారులు కేంద్ర ఆటర్నీ జనరల్ కు నివేదించారు. అయితే ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ విషయంలో చేయలేమని చెప్పగా.. ఏపీలో గత కొద్దిరోజులుగా రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు సిఆర్డిఏ అధికారులు. అమరావతి విషయంలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పడాలంటే చట్టబద్ధత ఒక్కటే శరణ్యమని ఏపీ నుంచి వినతులు వెళ్లేసరికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. అందుకే ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ తీసుకొచ్చి.. చట్టబద్ధత కల్పించాలన్నది ప్లాన్. అది ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే అమరావతికి శుభపరిణామమే. అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న ప్రతికూల ప్రచారానికి తెరపడినట్టే.