Uttarandhra
Uttarandhra: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. రకరకాల కారణాలతో రాజీనామాలు చేస్తున్నారు. అయితే వారికి కూటమి పార్టీల్లో గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో పాటు తటస్థ నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఇంకోవైపు వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలకు మాత్రం కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. అయితే ఇప్పుడు కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతల అభిప్రాయాలకు అనుగుణంగా మూడు పార్టీల్లో చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరికల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
* ఆళ్ల నాని అలా
మొన్నటికి మొన్న మాజీమంత్రి ఆళ్ల నాని( alla Nani ) తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు( Chandrababu) స్వయంగా కండువా వేసి ఆహ్వానించారు. ఏలూరు నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు ఆళ్ల నాని. అయితే వివాదాస్పద అంశాల జోలికి పోలేదు కానీ.. ఆయన తీరుతో ఏలూరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఇబ్బంది పడ్డాయి. ఆయన చేరికను చేరికకు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అందుకే ఆళ్ళ నాని చేరిక ఆలస్యం అయ్యింది. అయితే ఏపీలో మరింత బలపడాలి అంటే నేతల ను ఆహ్వానించాలని చంద్రబాబు సొంత పార్టీ శ్రేణులను సముదాయించారు. దీంతో ఆళ్ల నాని చేరికకు అడ్డంకులు తొలగాయి.
* అవంతి శ్రీనివాసరావు సిద్ధం
ఇంకోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ ఇద్దరు మాజీ మంత్రులు( ex ministers ) తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన పూర్వశ్రమంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. 2014లో అనకాపల్లి ఎంపీగా టిడిపి తరఫున ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆయన టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. కానీ భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అభ్యంతరాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు పిలిచి మాట్లాడేసరికి గంటా శ్రీనివాసరావు మెత్తబడినట్లు సమాచారం. త్వరలో అవంతి శ్రీనివాసరావు టిడిపిలో చేరడం ఖాయంగా తెలుస్తోంది.
* కుమారుడి భవిష్యత్తు కోసం
మరోవైపు శ్రీకాకుళం( Srikakulam ) జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. వైసీపీలో మంత్రిగా వ్యవహరించిన ఆయన ఓటమి ఎదురయ్యేసరికి అజ్ఞాతంలో ఉన్నారు. కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారు. అయితే టిడిపి నాయకత్వం నుంచి ఆ దిశగా భరోసా వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాలోని కీలక నేతలు దీనికి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు కానీ తన కుమారుడి భవిష్యత్తుకు భరోసా ఇస్తే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. మొత్తానికైతే చేరికల విషయంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.