Chandrababu: ఏపీలో గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. కానీ వైసీపీలో అతి ధీమా కనిపిస్తోంది. జగన్ ఎన్నికల ప్రమాణ స్వీకార తేదీ ప్రకటించే వరకు పరిస్థితి వెళ్ళింది. అటు వైసిపి కీలక నేతలు సైతం గెలుపు ధీమా ప్రకటనలు చేస్తున్నారు. అయితే వైసిపి తో పోల్చుకుంటే.. టిడిపి కూటమి నుంచి ప్రకటనలు రావడం లేదు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మూడు పార్టీల శ్రేణుల్లో ధీమా కనిపిస్తోంది. చంద్రబాబు కానీ.. పవన్ కానీ ఎక్కడ బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయలేదు. విదేశాలకు వెళ్లే ముందు జగన్ కీలక ప్రకటన చేశారు. విదేశాల నుంచి వస్తూ ట్విట్ చేశారు. కానీ చంద్రబాబు బయట పడలేదు. దానినే ఎద్దేవా చేస్తోంది వైసిపి.
అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగానే బయటపడడం లేదని తెలుస్తోంది. ఏపీపై కేంద్రానికి కూడా స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. హోం శాఖ మంత్రి అమిత్ షా అయితే ఏపీలో కూటమికి 17 నుంచి 18 పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఆ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీలో ఓ టీవీ ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టి చెప్పారు. అయితే అదే సమయంలో చంద్రబాబు గోప్యత ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఆంతరంగికుల సమావేశంలో చంద్రబాబు ఈ విషయంలో బయటపడినట్లు తెలుస్తోంది. ఎన్ని స్థానాలు సాధిస్తామో వివరించినట్లు సమాచారం. ఏపీలో కూటమికి 122 నుంచి 135 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు కీలక నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.
అంతర్గత సర్వేలు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏపీలో కూటమిదే అధికారమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే బయట పెడితే టిడిపి కూటమిలో ఒకరకమైన ధీమా వస్తుందని.. అది అసలుకే ఎసరు వస్తుందని భావించి బయట పెట్టలేదని తెలుస్తోంది.ప్రధానంగా పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటివి టర్న్ అయినట్లు చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. మరోవైపు మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగడంతో కూటమికి భారీ ఆధిక్యత లభించింది అని నివేదికల్లో తేలినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ వరకు మూడు పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలంటే.. ఈ ధీమా ప్రకటన గోప్యంగా ఉంచాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే టిడిపి కీలక నేతలకు, అభ్యర్థులకు సమాచారం అందించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.