AP Summer Updates: ఏపీలో( Andhra Pradesh) ఒక్కసారిగా వాతావరణం మారింది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటిపూట ఎండలు మండుతున్నాయి. రాత్రి మాత్రం చలి కొనసాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో ఈ పరిస్థితి ఉండగా.. ఉత్తరాంధ్రలోని మన్య ప్రాంతంలో మాత్రం పొగ మంచు ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రథసప్తమి నుంచి ఎండల తీవ్రత అధికం కావడం విశేషం. ఇంకోవైపు శివరాత్రి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత మాత్రం అధికంగా ఉంది.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
చాలా చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాబోయే మూడు రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. పగటిపూట ఎండలు మండిపోతుంటే.. రాత్రికి మాత్రం వాతావరణం మారుతోంది. చలిగాలుల దెబ్బకు జనాలకు ఇబ్బంది తప్పడం లేదు. ఇక ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా మాడుగుల లో 7.1° కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఇంతటి వాతావరణ పరిస్థితుల్లో రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాలో తేలికపాటి వర్షాలు కొరవడం విశేషం. ఫిబ్రవరి రెండో వారంలో శివరాత్రి కావడంతో అప్పటినుంచి చలిగాలుల తీవ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
పొగ మంచు ప్రభావం..
ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పొగ మంచు కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచి మంచు తీవ్రత అధికం అవుతోంది. ఉదయం 9 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు జిల్లాలో పొగ మంచు ప్రభావం ఉంటోంది. ఉదయం 10 గంటల తర్వాత వాతావరణం మారిపోతోంది. ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఫిబ్రవరిలో ఇలా హెచ్చుతగ్గులు కొనసాగుతూ.. మార్చి నుంచి ఎండల ప్రభావం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.