AP Volunteers : వాలంటీర్లు ఉంటారా? ఉండరా? ఈనెల పింఛన్లు సచివాలయ ఉద్యోగులతోనే! ఏం జరుగుతోంది?

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. కనీసం ఆ దిశగా ప్రభుత్వం సన్నాహాలు కూడా చేయడం లేదు. ఇదో దుబారా వ్యవస్థగా గతంలో అభివర్ణించారు చంద్రబాబు. ఒకవేళ ప్రత్యామ్నాయంగా వాలంటీర్ల వ్యవస్థను నియమించినా..

Written By: Dharma, Updated On : July 27, 2024 11:57 am

AP Volunteers

Follow us on

AP Volunteers :  ఆగస్టు సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. గత నెల మాదిరిగా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తారా? లేకుంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. జూలై 1న పెంచిన పింఛన్లను సచివాలయ ఉద్యోగులతో అందించగలిగింది కూటమి సర్కార్. దానిని ఒక కేస్ స్టడీగా భావించింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ నిలిపివేయడంతో.. పింఛన్ల పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయాలని అప్పట్లో ఎన్నికల కమిషన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ అప్పుడు సర్కార్ సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయలేమని చేతులెత్తేసింది. అప్పట్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ ఆదేశాలతోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రకటన చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేసింది. సచివాలయ ఉద్యోగులతో ఈ ప్రక్రియను పూర్తి చేసింది. తొలిరోజు 80 శాతానికి పైగా పింఛన్లు అందించింది. రెండో రోజు శత శాతం పూర్తి చేయగలిగింది. వైసీపీ సర్కార్ చేయలేని పని తాను చేసి చూపించింది. అయితే ఇప్పుడు ఆగస్టు సమీపిస్తుండడంతో.. గత నెల మాదిరిగా సచివాలయ ఉద్యోగులతో అందిస్తారా? లేకుంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారితో పంపిణీ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం సచివాలయ ఉద్యోగుల తోనే పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* చంద్రబాబు యూ టర్న్
ఎన్నికలకు ముందు వాలంటీర్ల విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే సమయంలో చంద్రబాబు తప్పుపట్టారు. అదో దోపిడీ వ్యవస్థగా అభివర్ణించారు. కానీ ఎన్నికల ముంగిట వాలంటీర్ల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు. 5000 రూపాయల జీతం ఇచ్చి అడ్డగోలుగా పని చేయించుకుంటున్నారని.. తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లు వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పైగా నెలకు పదివేల రూపాయల వేతనాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. అందుకే వైసిపి నేతలు ఎంత ఒత్తిడి చేసినా చాలామంది వాలంటీర్లు రాజీనామా చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను.. కేవలం లక్ష మంది మాత్రమే రాజీనామా చేశారు. మిగతా లక్షన్నర మంది రాజీనామా చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమను విధుల్లోకి తీసుకుంటారని వారు భావిస్తున్నారు.

* కాలం దాటుతున్నా
టిడిపి కూటమి ప్రభుత్వానికి అసలు వాలంటీర్లను నియమించే ఉద్దేశం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు దాటుతోంది. మంత్రులు మాత్రం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొందరైతే ఇది దుబారా ఖర్చు అని.. అవసరం లేదన్న రీతిలో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మాత్రంమంత్రివర్గంలో వాలంటీర్ల వ్యవస్థ సమన్వయానికి ఒక శాఖను ఏర్పాటు చేసింది. దీంతో తప్పకుండా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని అంతా భావిస్తున్నారు.

* ఈనెల సచివాలయం ఉద్యోగులతోనే
ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ సచివాలయ ఉద్యోగులతో చేపడితే మాత్రం వాలంటీర్లు ఆశలకు వదులుకున్నట్టే. గత నెలలో కేవలం సచివాలయ ఉద్యోగులతో ట్రయల్ రన్ వేశారని.. సక్సెస్ కావడంతో ఈనెల సైతం వారితో కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలు బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించిన నేపథ్యంలో.. పింఛన్ల పంపిణీ ని సైతం వారితోనే చివరి వరకు కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థను రద్దుచేసి.. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారని.. ముఖ్యంగా విద్యార్హత విషయంలో ఆంక్షలు అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి