Sakshi media :తెలుగు మీడియా రంగంలో సాక్షి ది ప్రత్యేక స్థానం.2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సాక్షిని స్థాపించారు ఆయన తనయుడు జగన్. ఏకకాలంలో పత్రికతో పాటు టీవీ ఛానల్ ను ప్రారంభించారు.జగన్ అక్రమాస్తుల జాబితాలో సాక్షి కూడా ఒకటి. క్విడ్ ప్రోతో పెట్టుబడులు సమకూర్చుకొని సాక్షి మీడియాను ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగులో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడును అధిగమించాలన్న ఆలోచనతో సాక్షి పేపర్ ను రూపాయి కే అందించారు జగన్. తాను ఇవ్వడమే కాకుండా మిగతా పత్రికలను కూడా అలానే విక్రయించాలని భావించారు జగన్. కానీ అది వర్కౌట్ కాలేదు. తన సాక్షిని సైతం మిగతా పత్రికల ధరకు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పరిస్థితి మారింది. భారీ ఎత్తున ప్రభుత్వ ప్రకటనలతో పాటు ప్రభుత్వ సొమ్ముతోనే సర్క్యులేషన్ పెంచుకున్న ఘనత జగన్ దే. ప్రస్తుతం సాక్షి మీడియాకు జగన్ రెడ్డి భార్య భారతి చైర్మన్ గా కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా సాక్షికి ప్రకటనల రూపంలో వందల కోట్లు సమకూరగా.. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యామ్నాయ నామినేటెడ్ పోస్టుల ద్వారా ప్రభుత్వమే జీతాలు చెల్లించిందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వైసిపి అధికారానికి దూరం కావడంతో.. సాక్షికి కేటాయించిన ప్రకటనలు, ఆయాచిత లబ్ధి గురించి విషయాలు బయటకు వస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం సాక్షికి జగన్ సర్కార్ చేసిన కేటాయింపుల గురించి వెల్లడించింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
* వాలంటీర్లకు పత్రిక
రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరందరికీ సాక్షి పత్రికను అందించే ఏర్పాట్లు చేశారు. ఎందుకు గాను ఒక్కో ఒలంటీర్ కు 250 రూపాయలు ప్రభుత్వం తరఫున కేటాయించారు. గత ఐదేళ్ల కాలంగా ఈ నిధులు నేరుగా సాక్షికి జమ అయ్యేవి. పంచాయితీలో ఎంతమంది వాలంటీర్లు ఉంటే అంతమంది విధిగా సాక్షి పత్రిక తీసుకోవాల్సిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలన గురించి వారు సమగ్రంగా తెలుసుకునేందుకు సాక్షి పత్రిక ఉపయోగపడుతుందని.. అందుకే పత్రిక చందాదారులుగా వాలంటీర్లను చేర్చమని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
* ప్రకటనల్లో సింహభాగం
అయితే ఒక్క సర్క్యులేషన్లోనే కాదు.. ప్రభుత్వ ప్రకటనల్లోనూ సాక్షి మీడియాదే సింహభాగం. మొత్తం ప్రభుత్వ ప్రకటనల రూపంలో.. ఐదేళ్ల వైసిపి హయాంలో రూ. 858 కోట్లు ఖర్చు చేశారు. అందులో సాక్షి మీడియాకే రూ. 400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. మిగతా మొత్తాన్ని అస్మదీయ మీడియాకు అప్పగించారు. డిజిటల్ కార్పొరేషన్ కు ఏకంగా 180 కోట్ల ప్రకటనలు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐ డ్రీం యూట్యూబ్ ఛానల్ ఎండి వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ కి ఏకంగా ఎండిని చేశారు.
* అడ్డగోలు దోపిడి
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మీడియా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో ఎక్కువమంది సాక్షి ఉద్యోగులే. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియా నుంచి వచ్చిన వారే. ఒకప్పుడు ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీలోకి రప్పించి పార్టీ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో ప్రధాన సలహాదారుగా మార్చేశారు. పార్టీతో పాటు పాలనను కూడా అప్పగించారు. గత ఐదేళ్లుగా పార్టీ, ప్రభుత్వ సేవల్లో చాలామంది సాక్షి ఉద్యోగులు తరించారు. వారికి యాజమాన్యం నుంచి వేతనం రాలేదు. ప్రభుత్వం నుంచే వేతనం వెళ్ళేది. ఈ లెక్కన సాక్షి మీడియా కొల్లగొట్టింది వందల కోట్లు కాదని.. వేల కోట్లని ఆరోపణలు ఉన్నాయి.