Pawankalyan : జనసేనాని ఎన్నికల రణ క్షేత్రంలో అడుగుపెట్టనున్నారు.ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వారాహి వాహనానికి పూజలు చేసి యాత్ర ప్రారంభించనున్నారు.యాత్రలో తొలి బహిరంగ సభకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కత్తిపూడి బస్టాండ్ సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ఈ సభ జరగనుంది. తొలుత తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది.
జనసేనకు క్షేత్రస్థాయిలో బలం, ఆపై కాపు సామాజికవర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో యాత్ర కాబట్టి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. అయితే దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ పై ఉంది. ఇప్పటికే టీడీపీతో పొత్తుకు ఒక రకమైన అనుకూల వాతావరణం ఉన్నందున జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీచేస్తారో స్పష్టమైన ప్రకటన చేస్తే పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశముంది.
ఇప్పటికే టీడీపీతో కలిసి నడిచేందుకు సిద్ధమైనందున.. ఆ పార్టీతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు, పవన్ ప్రకటనలకు కొంత సారుప్యత ఉంది. అందుకే చంద్రబాబు, పవన్ లు కూర్చొని కొన్ని విధానాలను రూపొందించుకుంటే మంచిది. టీడీపీ మేనిఫెస్టోలో ఏడాది మూడు గ్యాస్ సిలెండర్ల హామీ ఇచ్చారు. ఇది ప్రజల్లో బలంగా వెళ్లింది. అటు పవన్ సైతం రేషన్ బియ్యానికి బదులు నగదు ఇవ్వడం సరైనదని చెప్పుకొచ్చారు. ఇది కూడా మంచి ఆలోచనే. ఇటువంటి వాటి విషయంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళితే వారాహి యాత్ర మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
పొత్తు అనేది రెండు పార్టీలకు ఉభయతారకంగా ఉండాలి. ఈ విషయంలో పవన్ కు ఉన్నంత చిత్తశుద్ధి మరోలా ఉండదు. గరిష్ట ప్రయోజనాలను కోరుకోవడంలో తప్పులేదు కానీ.. సీట్ల సర్దుబాటులో అలక్ష్యం వహిస్తే అది ప్రత్యర్థులకు వరంగా మారుతుంది. అంతిమంగా పొత్తు లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తోంది. అందుకే మిత్రుడిగా ఉన్న చంద్రబాబుతో మరింత సమన్వయం చేసుకుంటేనే కొన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలో అంశాలు దగ్గరగా ఉంటేనే రెండు పార్టీలను ప్రజలు కూడా నమ్ముతారు. అందుకే పవన్ ఎటువంటి మొహమాటాలకు పోకుండా.. తెగింపునకు రావాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.