Chandrababu : జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబుది ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న పరిస్థితి. ప్రస్తుతం టిడిపి, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు కూడా జరిగాయి. 32 వరకు సీట్లను పవన్ డిమాండ్ చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఈ లెక్కన 30 లోపు స్థానాలను టిడిపి వదులుకోవాల్సి ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే బలమైన వైసీపీని ఢీ కొట్టాలంటే త్యాగం తప్పనిసరి అని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు భావించవచ్చు కానీ.. సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు ఎసరు వచ్చిన టిడిపి నాయకుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వారు కానీ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపితే మాత్రం.. ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు తేడా కొట్టే అవకాశం ఉంది.
అటు జనసేన అభిమానులు సైతం తక్కువ సీట్లు పవన్ తీసుకుంటే హర్షించే అవకాశం లేదు. తక్కువ సీట్ల ద్వారా పవర్ షేరింగ్ ఎలా దక్కించుకుంటారన్నది జనసేన నుంచి వినిపిస్తున్న మాట. వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుంటేనే కాపు సామాజిక వర్గం పొత్తును విశ్వసించేది. అప్పుడే సక్రమంగా ఓట్లు బదలాయింపు జరిగేది. చేగొండి హరి రామ జోగయ్య సైతం ఇదే అభిప్రాయంతో పవన్ కు లేఖ రాశారు. కాపు సామాజిక వర్గం ఓట్లు కూటమికి ఏకపక్షంగా దక్కాలంటే.. జనసేనకు 50 కి పైగా సీట్లు కేటాయించాల్సిందే నన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ స్థాయిలో టికెట్లు కేటాయిస్తేనే కాపులు విశ్వసించేది అనేది ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అంతేతప్ప 30 లోపు సీట్లు ఉంటే.. సింహప్రయోజనం టిడిపికి దక్కితే.. కాపు సామాజిక వర్గం ఓటర్లు పునరాలోచించే అవకాశం ఉంది. ఒక్క జనసేన పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాపు ఓటర్లు ఏకపక్షంగా మద్దతు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. టిడిపి పోటీ చేసే అభ్యర్థుల నియోజకవర్గాల్లో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగే పరిస్థితి ఉండదన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో రియాక్షన్ ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి గత ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో జనసేన డిపాజిట్లు దక్కించుకుంది. అందుకే 16 నుంచి 20 లోపు అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా నాయకులు దశాబ్దాలుగా ఉన్నారు. పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతం ఆ నేతలు కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు అదే నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తే మాత్రం అభ్యంతరాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.ఒక్కసారి నియోజకవర్గాన్ని వదులుకుంటే పార్టీ పట్టుకోల్పోవడం ఖాయమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలకు మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. దీంతో చంద్రబాబు ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పై స్థాయిలో సీట్ల సర్దుబాటు విషయం సవ్యంగా సాగినా.. క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి పరిస్థితి తారుమారు కాక తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. దీనిపై ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.