AP BJP: ఏపీలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. అయితే బిజెపి ఇప్పటికే ఏపీ ఫై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిందని.. ఇక్కడ రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. వీలైనంత వరకూ న్యూట్రల్ గా ఉండాలని.. ఒకవేళ పొత్తు అనివార్యమైతే సింహ ప్రయోజనం పొందాలని చూస్తోంది.
ఏపీలో పరిస్థితులపై బిజెపి ఒక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. జనవరి మూడో వారంలో ఓ సంస్థతో సర్వే చేయించినట్లు సమాచారం. ఆ సర్వేలో వైసీపీకి అనుకూలంగా పరిస్థితి ఉన్నట్లు తేలిందని తెలుస్తోంది. అందుకే ఏపీ విషయంలో పెద్దగా ఆలోచన చేయకూడదని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా జగన్ అంశాల వారీగా ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్డీఏలో చేరకపోయినా బలమైన మద్దతు దారుగా కొనసాగుతున్నారు. అదే చంద్రబాబు విషయానికి వచ్చేసరికి సహేతుకమైన కారణాలు లేకుండా, బిజెపిని నష్టపరిచే విధంగా ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే బలమైన మద్దతుదారుడైన జగన్ గెలిచినా తమకు వచ్చే ఇబ్బంది ఏంటి ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పొత్తుల విషయంలో సైతం ఒక వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి తనంతట తానుగా ముందుకు వచ్చి పొత్తు ప్రతిపాదన చేయడం వల్లే బిజెపి వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు వస్తానంటే బిజెపి అగ్రనేతలు రమ్మని చెప్పడంతో.. ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అయితే పొత్తులో భాగంగా 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలను బిజెపి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిడిపి, జనసేన కలిసి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని.. బిజెపి కూటమిలోకి రావాలంటే మాత్రం సింహభాగం పార్లమెంటు స్థానాలు కేటాయించాల్సిందేనని బిజెపి అగ్రనేతలు తేల్చి చెప్పినట్లు సమాచారం. అప్పుడే ఎన్నికల్లో వ్యవస్థల పరంగా తమ వంతు సహకారం అందిస్తామని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే.
అయితే చంద్రబాబుకు 2019 ఎన్నికల భయం వెంటాడుతోంది. ఎన్నికల్లో జగన్ శక్తి యుక్తులను వినియోగిస్తారని అనుమానిస్తున్నారు. అందుకే బిజెపి అడిగిన సీట్లను ఇచ్చేందుకు సానుకూలత ప్రదర్శిస్తున్నారు. అయితే బిజెపి అడుగుతున్నట్లు 10 నుంచి 12 సీట్లు కాకున్నా.. 6 నుంచి 8 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం తమ సర్వే ప్రాతిపదికన వైసీపీ గెలుస్తుందని.. అందుకే తాము కూటమిలోకి రావాల్సిన అవసరం లేదని.. మీరు పిలుస్తున్నారు కాబట్టి చేరతామని.. కానీ సింహభాగం సీట్లు తమకు కేటాయించాల్సిందేనని బిజెపి అగ్ర నేతలు పట్టుబడుతున్నారు. కానీ వారిని ఒప్పించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.