Monsoon : తెలుగు ప్రజలకు తీపి కబురు. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా, నెల్లూరు వరకూ రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు సైతం పడ్డాయి. ఈ ఏడాది సుదీర్ఘ వేసవి కొనసాగింది. రుతుపవనాల రాక ఆలస్యమైంది. మరోవైపు ఎండలు మండిపోయాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో వాతావరణం చల్లబడింది. ప్రజలకు ఉపశమనం లభించింది.
రుతుపవనాల రాకతో వర్షాలు ఊపందుకోనున్నాయి. బుధవారం కోస్తాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం కూడా వర్షాలు నమోదయ్యే చాన్స్ ఉంది. మంగళవారం విజయవాడలో అత్యధికంగా 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరి, కొండపిలో 64, ఎ.కొండూరులో 58, కొలిపరలో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ బులెటెన్ లో స్పష్టం చేసింది. రానున్న రెండు, మూడురోజుల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించేందుకు అనువైన వాతావరణం నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈనెల 23న బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఆ మరుసటి రోజుకు అల్పపీడనంగా మారనుంది. ఒడిశా, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ ల మీదుగా రాజస్థాన్ వైపు పయనించనుంది. ఆ సమయంలో రుతుపవనాల్లో చురుగ్గా కదలిక వస్తుంది. దీంతో వర్షాలు కూడా ఊపందుకోనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తొలకరి జల్లులు పడుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. వరి ఆకుమడులు సిద్ధం చేసే పనిలో రైతులు పడ్డారు. ఒకటి రెండు రోజులు వర్ష తీవ్రత చూసుకొని విత్తనాలు వేసేందుకు సిద్ధపడుతున్నారు.