AP weather Alert: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) వాతావరణం మారుతోంది. ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయినా రాత్రికి చలి కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతం నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. అయితే ప్రస్తుతం ఉత్తర కోస్తాలో దట్టమైన పొగ మంచు పడుతోంది. మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. రథసప్తమి తరువాత ఎండల తీవ్రత పెరుగుతాయి. శివరాత్రి తరువాత చలి తగ్గి.. ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీలంక, తమిళనాడుకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోని ఏర్పడింది. దీని ప్రభావంతో తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతోనే తమిళనాడు, కర్ణాటక సమీపంలోని రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి.
గత ఏడాది డిసెంబరు వరకు..
గత ఏడాది డిసెంబరు( December) వరకు వర్షాలు పడ్డాయి. తరువాత బ్రేక్ ఇచ్చాయి. ఇప్పుడు మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈరోజు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అయితే శివరాత్రి వరకు ఈ పొగ మంచు కొనసాగే అవకాశం ఉంది. అక్కడ నుంచి క్రమేపి తగ్గి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
వణికిస్తున్న చలి..
ఏజెన్సీ( agency) ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలులతో జనాలు వణికి పోతున్నారు. ఉదయం 10 గంటల వరకు పాడేరులో దట్టమైన పొగ మంచు కురుస్తూనే ఉంది. దీంతో ప్రయాణాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనదారులు లైట్లు వెలిగించుకొని ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. మరోవైపు మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జి. మాడుగులలో 8.6, అరకు లోయలో 8.8, ముంచంగి పుట్టులో 9.3, జీకే వీధిలో 9.6, పెద్దబయలులో 10, చింతపల్లిలో 10.1, హుకుంపేటలో 10.4, కొయ్యూరులో 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా శివరాత్రి తరువాత మంచు ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన మరో మూడు వారాల పాటు ఇబ్బందులు తప్పవు అన్నమాట.