Pawan Kalyan: ఈ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించింది. కూటమి గెలుపులో పవన్ కీలక పాత్ర పోషించారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ గెలుపొందింది. దీంతో ఒక్కసారిగా పవన్ పేరు మార్మోగిపోయింది. పవన్ డిప్యూటీ సీఎం తో పాటు హోం మంత్రి పదవి స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ ఆయన అందుకు విరుద్ధంగా కీలకమైన పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖలను స్వీకరించారు. అటవీ శాఖ, పర్యావరణ శాఖను సైతం దక్కించుకున్నారు. ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల స్వరూపాన్ని మార్చాలని భావిస్తున్నారు. పల్లె పండుగ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, మౌలిక వసతుల కల్పనకు దాదాపు 4500 కోట్లు కేటాయించారు పవన్ కళ్యాణ్. తనకు లభించిన శాఖలకు పూర్తిస్థాయి న్యాయం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు హోంశాఖ పదవిలో ఊహించారు. కానీ తనకు గ్రామీణాభివృద్ధి ఇష్టం కావడంతో ఆ శాఖలను తీసుకున్నారు పవన్. అయితే తాజాగా పిఠాపురంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. తానే హోంమంత్రి అయివుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లారు. 15 రోజుల కిందట పిఠాపురంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మరోసారి పిఠాపురంలో పర్యటించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పాడా పేరుతో ఒక్క కొత్త సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పిఠాపురంలో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను ప్రకటించారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి ప్రభుత్వ పనితీరుపై భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యంగా వరుస అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాల ప్రస్తావన వచ్చింది.
* ఘాటుగా స్పందించిన పవన్
అయితే స్థానికులు ఒక్కసారిగా ప్రశ్నలు వేసేసరికి ఘాటుగా స్పందించారు పవన్. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వరుస జరుగుతున్న ఘటనలపై హోంమంత్రి అనిత సమీక్షలు జరపాలని పవన్ సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని.. పోలీసులు మర్చిపోకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆడపిల్లలను రేప్ చేస్తే కులం ఎందుకని పవన్ ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకు ఏం చెప్తుందని పవన్ అడిగారు. ఏదైనా తెగేదాకా లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
* చెడ్డ పేరు వస్తుండడంతో
ఇటీవల వరుస పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు చెలరేగడంతో పవన్ తనదైన రీతిలో స్పందించారు. ఒకవైపు హోం శాఖ వైఫల్యాన్ని ఎండగడుతూనే.. మరోవైపు గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనల గురించి ప్రస్తావించారు పవన్. తనతోపాటు చంద్రబాబుపై ఎన్నో రకాల కుట్రలు జరిగాయని.. అప్పుడు కూడా పోలీస్ శాఖ వైఫల్యం చెందిందని గుర్తు చేశారు పవన్. అందుకే వ్యవస్థలు బలంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఇలానే హోం శాఖపై విమర్శలు పెరిగితే తాను బాధ్యతలు తీసుకుంటానని సంకేతాలు పంపారు. మొత్తానికైతే పవన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హోం శాఖలో చూసుకోవాలన్న జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ వైసీపీ దుష్ప్రచారంపై మాట్లాడే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
నేను హోం మినిస్టర్ అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి
– పవన్ కళ్యాణ్అంటే..మీ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని ఒప్పుకునట్టే గా pic.twitter.com/f8QHNzg6VR
— Anitha Reddy (@Anithareddyatp) November 4, 2024