Liquor: ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రెండు వారాల కిందట ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. దాదాపు అన్ని పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి.అయితే ధరల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారు. అయితే ప్రీమియం బ్రాండ్లు సైతం పాత ధరల్లో లభించడం లేదు. దీంతో ధర తగ్గుతుందని ఆశించిన మందుబాబులు నిరాశకు గురయ్యారు. కొన్నిచోట్ల షాపుల మధ్య పోటీ ఉండడంతో అమ్మకాలు తగ్గాయి. ఈ తరుణంలో షాపుల యజమానులు అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మద్యం ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయితే మద్యం ధర తగ్గించకుండా.. ఒక బాటిల్ కొంటే కోడిగుడ్డు, వాటర్ ప్యాకెట్, డిస్పోజల్ గ్లాస్ ఫ్రీ అంటూ ప్రకటిస్తున్నారు. సాధారణంగా మద్యంతో పాటు వాటర్, స్టఫ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే క్వార్టర్ మద్యం వద్ద ఓ 30 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అక్కడే వినూత్నంగా ఆలోచించారు మద్యం షాపుల యజమానులు. ఉడకబెట్టిన కోడిగుడ్డు, రెండు రూపాయల విలువ చేసే వాటర్ ప్యాకెట్, మరో రెండు రూపాయలు విలువచేసే డిస్పోజల్ గ్లాస్ ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో సమయాభావం లేకుండా షాపు వద్ద అందుతుండడంతో మందుబాబులు అటువైపు వస్తారని వారి ఆలోచన.
* ఫ్లెక్సీల ఏర్పాటు
తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఓ షాపు వద్ద ఇలాంటి ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. పండుగ పూట అదిరిపోయే ఆఫర్ అంటూ చేసిన ఈ ప్రకటన మందుబాబులను ఆకట్టుకుంది. అయితే మద్యం ఆఫర్ పై ఇస్తారని అంతా భావించారు. కానీ వాటర్ తో పాటు స్టఫ్ అందిస్తుండడంతో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. మిగతా ప్రాంతాల్లో సైతం మద్యం దుకాణాల వద్ద ఇటువంటి బోర్డులు వెలుస్తుండడం విశేషం.
* నష్టం తప్పదని ఆందోళన
అయితే మద్యం దుకాణాలతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని చాలామంది భావించారు. అందుకే పోటా పోటీగా షాపులను దక్కించుకున్నారు. తేరా ఇప్పుడు వ్యాపారం లోకి అడుగుపెట్టిన వారికి నష్టం తప్పదని ఆందోళన వెంటాడుతోంది. వాస్తవానికి మార్జిన్ 20 శాతం వస్తుందనుకుంటే.. అన్ని లెక్కలు పోను 10 శాతం మిగులుతుందని.. అది కూడా సిండికేట్ కి వెళ్తుందని ఎక్కువమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే వ్యాపారాలు చేయలేమని చెబుతున్నారు. అమ్మకాలు పెంచుకోకపోతే నష్టం వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఇలా వినూత్నంగా ఆలోచించి అమ్మకాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.