Rajya Sabha Election: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. రాజ్యసభలో ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 3న షెడ్యూల్ వెల్లడించనుంది. దీంతో తప్పనిసరిగా అభ్యర్థుల ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో ఆశావహుల్లో సైతం ఒక రకమైన సందడి ప్రారంభం అయ్యింది. ఇప్పటికే రెండు విడతల నామినేటెడ్ జాబితాను ప్రకటించారు. చాలామంది సీనియర్లకు చోటు దక్కలేదు. అయితే వారికి ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవులు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి పక్కకు తప్పుకొని చాలామంది నేతలు వారసులకు అవకాశం ఇచ్చారు. అటువంటి వారిలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లాంటి నేతలు ఉన్నారు. అదే సమయంలో చివరి నిమిషంలో టికెట్లు వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి నేతలు సైతం పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండడంతో ఆశావహుల్లో సందడి ప్రారంభమైంది. మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఈ మూడు పదవులు చెరో పార్టీకి పంపకాలు చేస్తారా? లేకుంటే టిడిపి మూడు పదవులు తీసుకుంటుందా అన్నది చూడాలి.
* రెండు టిడిపి, ఒకటి జనసేనకు
ఈ మూడు రాజ్యసభ పదవుల్లో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2014లో మాత్రం కేంద్ర మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆయనకు పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజుని ఎంపిక చేశారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి అశోక్ గజపతిరాజు ఎంపిక చేయడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.
* సీనియారిటీకి గుర్తింపు
మరోవైపు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు జయదేవ్. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. వాస్తవానికి ఈసారి జయదేవ్ పోటీ చేసి గెలిచి ఉంటే కేంద్రమంత్రి అయ్యుండేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోక్సభలో గట్టిగానే పోరాటం చేసిన ఘనత జయదేవ్ కు ఉంది. అందుకే ఈసారి ఆయనను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది.
* మెగా బ్రదర్ కు అవకాశం
మరోవైపు జనసేనకుఒక రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఆ అవకాశం మెగా బ్రదర్ నాగబాబుకి అన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు మంచి పదవి అని ప్రచారం సాగింది. అయితే టీటీడీ చైర్మన్ పోస్ట్ విషయంలో నాగబాబు అంత సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన రాజ్యసభ పదవిపై ఆసక్తి పెంచుకున్నారని తెలుస్తోంది. అధినేత సోదరుడు కావడంతో జనసేనలో కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. జనసేనకు ఆ పదవి ఇస్తే మాత్రం నాగబాబుకు ఖాయమని తెలుస్తోంది. నాగబాబు రాజ్యసభకు ఎన్నికైతే జనసేన నుంచి తొలి ప్రాతినిధ్యం ఆయనదే.
* బిజెపికి ఛాన్స్ లేనట్టే
మరోవైపు టిడిపి ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. అందుకే ఈసారి ఇద్దరు రాజ్యసభ సభ్యులను పంపించి టిడిపి వాయిస్ ను వినిపించాలని చూస్తోంది హై కమాండ్. మరోవైపు బిజెపి సైతం ఏపీ నుంచి రాజ్యసభ సీటు అడిగే అవకాశం ఉంది. అయితే మున్ముందు రాజ్యసభకు అవకాశం ఇస్తామని.. ఈసారి మాత్రం టిడిపి, జనసేనకు విడిచి పెట్టాలని ఆ రెండు పార్టీలు కోరినట్లు తెలుస్తోంది.