Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అది. అయితే ఆయనేదో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు.కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి చేపట్టారు. వైయస్సార్ పై అభిమానంతోనే జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని.అయితే జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నారు బాలినేని. కానీ జగన్ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో పార్టీని వీడారు. అధినేత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. శత్రువుకు మించి వ్యవహరిస్తున్నారు. అయితే దీనిని జీర్ణించుకోలేకపోతున్నాయి వైసీపీ శ్రేణులు. అటు వైయస్ కుటుంబ అభిమానులు సైతం బాలినేని వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. బాలినేని తండ్రి పేరు వెంకటేశ్వర రెడ్డి. సొసైటీ బ్యాంకులో జాబ్ చేసేవారు ఆయన.ఆయన ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలో పనిచేసేవారు. బాలినేని సొంత నియోజకవర్గం కొండెపి. కానీ వారి కుటుంబం ఒంగోలులో ఎక్కువగా ఉండడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బాలినేని బాల్యం నుంచి అక్కడే గడిపారు.
* యూత్ కాంగ్రెస్ లీడర్ గా
యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో ఎక్కువగా ఉండేవారు బాలినేని. ఈ క్రమంలో ఎమ్మెల్యే కావాలన్నా బలమైన ఆకాంక్ష ఆయనలో ఉండేది. కానీ అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ వై వి సుబ్బారెడ్డి నుంచి ఆయనకు లభించింది. వై వి సుబ్బారెడ్డి ఏకైక చెల్లెలను బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వై వి సుబ్బారెడ్డికి రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు. 1999లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాజశేఖర్ రెడ్డి భావించారు. అందుకు గట్టిగానే కృషి చేశారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి దృష్టిలో పడ్డారు బాలినేని. అలా ఒంగోలు కాంగ్రెస్ టికెట్ను 1999 ఎన్నికల్లో దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలతో అదే పార్టీకి చెందిన నేత ఒకరు రెబెల్ గా మారారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో.. త్రిముఖ పోటీలో నెగ్గారు బాలినేని. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు.
* వై వి ద్వారానే ఆ గుర్తింపు
అయితే కేవలం వైవి సుబ్బారెడ్డి పేరుతోనే బయటకు వచ్చారు బాలినేని. రాజశేఖర్ రెడ్డి స్వయాన తోడల్లుడు అయిన వైవి కంటే బాలినేనికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. యువకుడు కావడంతో రాజకీయంగా ప్రోత్సహించాలని భావించారు. 2004 ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కింది బాలినేనికి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక వెలుగు వెలిగారు బాలినేని. 2009 ఎన్నికల్లో బాలినేని గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. కానీ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో ఇబ్బందుల్లో పడ్డారు బాలినేని.
* వైసిపి ఆవిర్భావంతో
వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు బాలినేని. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని.. మంత్రి పదవిని వదులుకొని మరి జగన్ వెంట అడుగులు వేశారు. 2012 ఉప ఎన్నికల్లో సైతం గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అదే సమయంలో జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. అయితే ఇది బాలినేనికి ఇష్టం లేదు. వై వి సుబ్బారెడ్డి ద్వారా రాజకీయ లబ్ధి పొందగలిగారు బాలినేని. అయితే ఆ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయారు. తన ఓటమికి వైవి సుబ్బారెడ్డి కారణమని భావించారు. అప్పటినుంచి వారిలో ఒక రకమైన విభేదాలు ఏర్పడ్డాయి. అయినా సరే వై వి తో సమానంగా బాలినేనికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు జగన్. 2019 ఎన్నికల్లో బాలినేని గెలవడంతో తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా విస్తరణలో మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే దీనికి వైవి సుబ్బారెడ్డి తీరే కారణమని అనుమానించారు బాలినేని. అప్పటినుంచి అసంతృప్తితోనే పార్టీలో గడుపుతూ వచ్చారు. అయినా సరే బాలినేని వైఖరిని భరించారు జగన్. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. ఇప్పుడు కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బాలినేనికి లైఫ్ ఇచ్చింది వై వి సుబ్బారెడ్డి. ప్రోత్సహించింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా జగన్ కు కొరకరాని కొయ్యగా మారారు. అధికార పక్షానికి ఒక అస్త్రంగా తయారయ్యారు.