Central Cabinet Ministers: మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 60 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఏపీ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అన్న చర్చ బలంగా జరుగుతోంది. టిడిపి నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారు? జనసేన నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురికి, జనసేన నుంచి ఒకరికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అటు బిజెపి నుంచి సైతం ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలో బిజీగా ఉన్న చంద్రబాబు రామోజీరావు అకాల మరణంతో హైదరాబాద్ వచ్చారు. భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు. కాగా కేంద్ర క్యాబినెట్ కూర్పుపై బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు శుక్రవారం రాత్రి కీలక చర్చలు జరిపారు. సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలో చేరే టిడిపి ఎంపీల విషయంలోనూ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. నడ్డా నివాసానికి చంద్రబాబుతో పాటు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వెళ్లారు. టిడిపి నుంచి మొత్తం నలుగురికి కేంద్ర క్యాబినెట్ లో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరికి క్యాబినెట్ హోదా, మరో ఇద్దరికి సహాయం మంత్రులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
క్యాబినెట్ మంత్రుల జాబితాలో గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈయన అమెరికాలో బడా పారిశ్రామికవేత్త. నామినేషన్ దాఖలు సమయంలో తన పేరిట వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పట్లో అదో సంచలన అంశంగా మారిపోయింది. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏపీకి తీసుకొస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. గుంటూరు నుంచి గెలిచిన ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.
ఇకరెండో క్యాబినెట్ పదవి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్ నాయుడు. దివంగత కింజరాపు ఎర్రం నాయుడు కుమారుడు. మంచి వాగ్దాటి తో పాటు అధినేత చంద్రబాబుకు ఇష్టమైన యువ నాయకుడు.పైగా బీసీ వర్గానికి చెందినవాడు. అందుకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.
ఇక టిడిపి నుంచి మూడో పేరు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి.ఈయన సైతం బడా పారిశ్రామికవేత్త. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. వైసీపీకి ఆర్థికంగా అండగా ఉండేవారు. ఈయన టిడిపిలో చేరిన తర్వాతే నెల్లూరులో టిడిపి స్వీప్ చేసింది. కచ్చితంగా ఈయన రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తారని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈయనకు సైతం చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. చివరిగా రాయలసీమ కోటాలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. బలమైన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఈయన పేరును పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యారు. ఇందులో మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి హ్యాట్రిక్ కొట్టారు. పైగా అధినేత పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన నేత. అందుకే బాలశౌరికి తప్పకుండా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. బిజెపి నుంచి పురందేశ్వరికి తప్పకుండా పదవి ఖాయం. రెండో పదవి ఇస్తే మాత్రంఅనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ కు ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఏపీ నుంచి ఐదుగురికి తగ్గకుండా కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.