Pawan Kalyan: పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. జనసేన వర్గాలు సైతం ఈ ప్రచారాన్ని నమ్మాయి. అటు పవన్ చర్యలు సైతం పిఠాపురం వైపే మొగ్గు చూపాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ మనసు మార్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈసారి ఆయన రాయలసీమకు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. బలిజలు అధికంగా ఉండే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడ ఉన్న పరిస్థితులనుపవన్ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్వాశ్రమంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వారికి ఫోన్లు వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక తో పాటు భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అంటూ గత నాలుగున్నర సంవత్సరాలుగా చాలా స్థానాలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా సొంత నియోజకవర్గ భీమవరం నుంచి పవన్ బరిలో దిగుతారని తొలుతా ప్రచారం జరిగింది. అయితే దాదాపు 90 వేలకు పైగా కాపు ఓట్లు ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అయితే పవన్ గెలుపు సునాయాసమని సర్వేలు తేల్చాయి. అప్పటినుంచి పిఠాపురం నియోజకవర్గమే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ తిరుపతి పై దృష్టి పెట్టినట్లు మరో టాక్ నడుస్తోంది.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి అసెంబ్లీ స్థానానికి చిరంజీవి పోటీ చేశారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి పై చిరంజీవి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన భీమవరం నుంచి పోటీ చేసిన చిరంజీవి ఓడిపోయారు. అయితే తిరుపతిలో చిరంజీవి గెలవడానికి ప్రధాన కారణం బలిజలు. ఆ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం అధికం. అందుకే పవన్ సైతం రాయలసీమ నుంచి పోటీ చేస్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతి అయితే సేఫ్ నియోజకవర్గంగాఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం.
అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో చాలామంది నాయకులు పని చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలోని పిఆర్పి లో పనిచేసిన నాయకులకు పవన్ టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అక్కడ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఫలితం సానుకూలంగా వచ్చే అవకాశం ఉందా? కుల ప్రభావం ఎంత? అన్న అంశాలపై పవన్ ఆరా తీసినట్లు సమాచారం. పైగా పొత్తులో భాగంగా తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తే.. పార్లమెంట్ స్థానాన్ని సైతం సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే తిరుపతి వైపు మొగ్గు చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కోస్తాంధ్రకు బై బై చెప్పినట్టే.దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.