Constituencies Redistribution: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.2027 ద్వితీయార్థంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది.దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది దీని లక్ష్యం.అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దీనిపై అధ్యయనం చేయించింది. ఇప్పటికే ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ఉభయసభలకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని కోరింది. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి సానుకూలత వచ్చింది. ఇండియా కూటమి పార్టీల నుంచి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం ప్లాన్ చేస్తుండడంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన తమ సానుకూలతను వ్యక్తం చేశాయి. విపక్షమైన వైసీపీ సైతం జై కొట్టింది. అయితే ఒక వైపు జమిలీకి కేంద్రం అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తోంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన పై మాత్రం ఎటువంటి దృష్టి పెట్టలేదు. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు ముందస్తు ఎన్నికల పుణ్యమా అని నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని మరిచిపోయింది.
* ఏపీలో మరో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.ఏపీకి సంబంధించి ప్రస్తుతం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా మరో 50 అసెంబ్లీ నియోజకవర్గం వర్గాలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే నియోజకవర్గాల సంఖ్య 225 కు చేరుకొని ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మరో ఏడు స్థానాలు పెరగనున్నాయి. కానీ ఇప్పుడు జమిలి పుణ్యమా అని పునర్విభజన అనే ఊసు లేకుండా పోయింది.
* ముందుగానే ప్రక్రియ
రాష్ట్ర విభజనతో ఏపీ చాలా విధాలుగా నష్టపోయింది. విభజన హామీలు కూడా అమలు కాలేదు. అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజనతో పాలన మరింత సౌలభ్యం అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి 2028 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ జమిలీలో భాగంగా 2027 ద్వితీయార్థంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన నియోజకవర్గాల పునర్విభజన చేస్తారా? చేయరా? అన్నది తెలియాల్సి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఉందంటే ముందస్తుగానే ప్రక్రియ ప్రారంభించాలి. అంతకుముందు జన గణన కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా పునర్విభజన చేసి.. నియోజకవర్గాల రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకుండా పోతోంది. అటు ఎన్నికల కమిషన్ సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో పునర్విభజనపై ఉన్న మిస్టరీ వీడడం లేదు.