MLA Kolikapoodi : టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కొలికపూడికి పిలిచి మరి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కూటమి ప్రభంజనంలో ఆయన తిరువూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి వివాదాస్పదమవుతూ వచ్చారు ఆయన. తొలినాళ్లలో వైసీపీ నేత ఇంటిని దగ్గరుండి నేలమట్టం చేయించారు. అప్పట్లో ఈ ఘటన చెడ్డ పేరు తీసుకొచ్చింది. అటు తరువాత మహిళా సంఘాల నేతల విషయంలో కలుగజేసుకున్నారు. వారిని గంటల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు. అంతటితో ఆగని ఆయనసొంత పార్టీ సర్పంచ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.చెప్పుతో కొడతానని హెచ్చరించారు. దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అది మరువక ముందే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. పనిమీద ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన మహిళల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో కొలికపూడి వ్యవహార శైలి పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే ఆయనలో మార్పు రాలేదు. తాజాగా మరో వివాదం బయటపడింది.
* అనూహ్యంగా ఛాన్స్
ఈ ఎన్నికల్లో కొలికపూడికి అనూహ్యంగా టిక్కెట్ దక్కింది. అమరావతి ఉద్యమ నేపథ్యంలో మీడియా డిబేట్లో చురుగ్గా ఉండేవారు ఆయన. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని పార్టీకి దూరమయ్యారు. ఎంపీ అభ్యర్థిగా మారిన ఆయన సోదరుడు చిన్ని.. పార్లమెంటు స్థానం పరిధిలోని తిరువూరు నియోజకవర్గానికి కొలికపూడి సరైన అభ్యర్థి అవుతారని సిఫారసు చేశారు. టిడిపి అనుకూల మీడియాకు చెందిన ఓ మీడియా అధిపతి సైతం పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు టిక్కెట్ ఇవ్వడం.. ఆయన గెలవడం జరిగిపోయింది. అయితే ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ శ్రేణులు ఆయనకు దూరం కావడం విశేషం.
* అధినేత మాట్లాడినా
వరుసగా కొలికపూడి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు పిలిచి మాట్లాడారు. అంతకుముందు తిరువూరు టిడిపి శ్రేణులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాయి. కొలికపూడి స్థానంలో.. ఇన్చార్జిని నియమించాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆయన అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఆయనను పిలిచి మాట్లాడారు. తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పార్టీకి నష్టం చేకూరిస్తేఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇది జరిగిన తరువాత ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు కొలికపూడి. ఈసారి రైతులపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన.
* రైతులపై హాట్ కామెంట్స్
రైతులకు మద్దతుగా కొలికపూడి ధర్మ పోరాట దీక్షకు దిగారు. అయితే ఆయనకు రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలపకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. రైతుల కోసం దీక్ష చేస్తుంటే మద్దతు తెలపరా? అంటూ ప్రశ్నించారు. కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదు అంటూ నోరు పారేసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన విషయంలో హై కమాండ్ చూసి చూడనట్టుగా వెళ్ళింది. కానీ ఈసారి ఉపేక్షించే పరిస్థితి ఉండదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే కోనేటి ఆదిమూలం మాదిరిగానే.. కొలికపూడి పై కఠిన చర్యలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More