YCP Party : సాధారణంగా అధికార పక్షానికి కొంత సమయం ఇవ్వాలి. కనీసం రెండు సంవత్సరాలైనా వారికి విడిచి పెట్టాలి. అప్పుడే వారి పాలనా వైఫల్యాలు బయటపడతాయి. వాటిని ఎండ కట్టడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి. కానీ జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం లేదు. ఆరు నెలల వ్యవధి ఇచ్చారు. సరిగ్గా పాలించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. జనవరి మూడో వారంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వారానికి జిల్లాలో రెండు రోజులపాటు బస చేయాలని చూస్తున్నారు. 26 జిల్లాలను చుట్టేయాలని భావిస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ప్రభుత్వం కొలువుదీరడంతోపాటు పాలన గాడిలో పడడానికి ఈ సమయం సరిపోయింది. ప్రజలు కూడా కూటమి పాలన కోసం ఎదురుచూస్తున్నారు. తొలి ఆరు నెలలను ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు. కానీ జగన్ మాత్రం ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి రివర్స్ అవుతుందేమోనన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.
* సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు
ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని నిలదీస్తున్నారు. అదే విషయాన్ని ప్రజల మధ్యకు వచ్చి ప్రశ్నిస్తానని చెబుతున్నారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. వైసిపి హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు జగన్. కానీ ప్రజలు మాత్రం ఆయన సంక్షేమానికి ఓటు వేయలేదు. అభివృద్ధి లేకపోవడాన్ని మాత్రమే గుర్తించారు. అందుకే వ్యతిరేకంగా ఓటు వేశారు. అటువంటిది ఆరు నెలలైనా కాలేదు.. సంక్షేమ పథకాలు అమలు చేయలేదంటే ఎలా? అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ప్రజలే సర్దుబాటు ధోరణిలో ఉన్న నేపథ్యంలో.. విపక్ష నేతగా జగన్ జనం మధ్యకు వచ్చి ఎలా నిలదీస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు
ప్రాధాన్యతా క్రమంలో కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. అదే సమయంలో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో రూ. 4,500 కోట్లతో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇంకోవైపు రహదారుల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రహదారులు దెబ్బతిన్నాయి.ఇది అందరికీ తెలిసిన విషయమే. అవే రహదారుల పైకి వచ్చి జగన్ ప్రశ్నిస్తే..ప్రజలు కూడాతిరగబడతారని, నిలదీస్తారని వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి.కేవలం రాజకీయ హడావిడి తప్ప..జగన్ పర్యటన క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి మరి కొంత సమయం ఇచ్చి.. అప్పుడు జనం బాట పడితే బాగుంటుందని సూచిస్తున్నారు. కానీ జగన్ ఎవరి మాటను నమ్మే రకం కాదు. వైసీపీ శ్రేణుల్లో అదే భయం.