Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీలో అంతర్మధనం.. ఓటమికి కారణాలెన్నో!

YCP: వైసీపీలో అంతర్మధనం.. ఓటమికి కారణాలెన్నో!

YCP: 2019 ఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా దిమ్మతిరిగే విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోను రికార్డును కొనసాగించారు. అయితే అది విజయం గా కాదు.. ఓటమిలో. గత ఎన్నికల్లో చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. 151 సీట్లు సాధించిన వైసిపి.. ఈసారి 164 సీట్లు కోల్పోయింది. 2019లో ఆయనపై జనం నమ్మకం పెట్టుకోగా.. ఇప్పుడు ఆ నమ్మకం ఎటో వెళ్లిపోయింది. ఆ విశ్వాసం కరిగిపోయింది. నేను చేసిన మేలు, ఇచ్చిన పథకాలు ఎటు వెళ్లిపోయాయి అంటూ జగన్ నిర్వేదం వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది.

రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాను అన్నది జగన్ వాదన. ఒకవిధంగా చెప్పాలంటే వర్ణించలేని బాధ కూడా. జనాన్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ.. జనం చేతిలో మోసపోయింది తానే అన్నట్టు జగన్ ప్రకటించడం ఆయన నిస్సహాయ స్థితికి కారణం. ఆ పరిస్థితి కూడా ఆయనే కారణం. ఆయన స్వయంకృతాపం. ప్రధానంగా జనం భయపడ్డారు. జగన్ పాలనలో కొంత అయితే.. విపక్షాల దుష్ప్రచారంతో మరికొంత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారో నన్న భయం ప్రజలను వెంటాడింది. అందుకు తగ్గట్టుగానే మాట్లాడిన వారికి సిఐడి పట్టుకెళ్ళింది. విపక్ష నేతలపై ఉక్కు పాదం మోపింది. అరెస్టుల ప్రభావం కూడా సామాన్య జనాల్లో భయానికి కారణం అయ్యింది.

సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోదు. అభివృద్ధి కూడా కావాలి అన్నది ప్రజల అభిమతం. మాట తప్పడు మడమ తిప్పడు అన్న మంచి పేరు జగన్ పై ఉన్నా.. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారు. మధ్య నిషేధ విషయంలో మాట తప్పరు. సిపిఎస్ రద్దు పైన మాట తప్పారు. ఈ మూడు సహేతుక కారణాలు చాలు జగన్ ఓటమికి. సంక్షేమ పథకాలమాటున ఈ మూడు హామీలు కొట్టుకుపోతాయని జగన్ భావించారు. కానీ అవే విశ్వరూపం చూపాయి. ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి.

మేము నగదు పంచాం. చెప్పేందుకు వాలంటీర్లు ఉన్నారు. మాకంటూ ప్రత్యేక ఓటర్లు ఉన్నారు.. ఇలా ఏవేవో చెప్పుకొని సొంత పార్టీ మనుషులను నమ్మలేదు. ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా అధినేతను కలవాలంటే కట్టడి. అపాయింట్మెంట్ దొరకాలంటే అతి కష్టం. ఇటువంటి అంశాలన్నీ అధికార పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీసాయి.తామే అభ్యర్థులం అన్న రీతిలో గత ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు గట్టిగానే పోరాడాయి. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లే అన్ని అయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. అసలు ఎమ్మెల్యేలే ఉత్సవ విగ్రహాలుగా మారారు అన్న ఆరోపణలు వచ్చాయి.ఇవన్నీ ఓటమికి కారణాలే.

అమరావతి రాజధాని అంశం ఎక్కువగా ప్రభావం చూపింది. ఆ రెండు జిల్లాలే సరి కదా.. ఏం జరుగుతుంది లే అన్న ధీమా మూల్యానికి కారణమైంది. పోనీ మూడు రాజధానులకైనా ముందడుగు పడిందంటే అదీ లేదు. రాజధాని లేని రాష్ట్రం గా ఏపీ అవతరించింది. అమరావతి స్మశానమైంది. కాదు కాదు అలా మంత్రులు ప్రకటించారు. మూడున్నర సంవత్సరాలుగా అమరావతి రైతుల ఆర్తనాధాలను ప్రజలు చూశారు. తమ సొంత ప్రాంతానికి రాజధాని వస్తుందంటే ఉత్తరాంద్రులు స్వాగతించలేదు. తమ నుంచి రాజధానిని దూరం చేశారని రాయలసీమ వాసులు ఆక్రయించారు. మూడు ప్రాంతాల ప్రజలు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. తమ ఓటుతో బుద్ధి చెప్పారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular