YCP political strategy: కాపుల్లో అత్యవసరంగా చీలిక రావాలి. కూటమికి బలం తగ్గాలి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆలోచన ఇదే. అందుకు ఏ అవకాశం వచ్చినా జారవిడుచుకోదు ఆ పార్టీ. అయితే అటువంటి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు రంగా సేన భారీ బహిరంగ సభతో. దాదాపు లక్ష మంది వరకు కాపులు వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈ సభను సక్సెస్ చేసే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపులను తరలించడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ సభ ఎంత సక్సెస్ అయితే కూటమికి అంత మైనస్ అవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి అప్పట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమ సెగ తగిలింది. ఇప్పుడు కూడా ఈ రంగా సేన సెగ తగులుతుందని నమ్మకం పెట్టుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
అప్పట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమం..
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) విజయం సాధించింది.. అయితే తెరపైకి కాపు రిజర్వేషన్ ఉద్యమం వచ్చింది. ఎన్నికల్లో భాగంగా కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చినందున అమలు చేయాల్సిందేనని కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. అప్పట్లో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తునిలో రైలు విధ్వంసం ఘటన చోటుచేసుకుంది. 2015లో ఈ ఘటన జరిగింది. అయితే అప్పట్లో ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక వైసిపి గుండాలు ఉన్నారని ఆరోపించారు. అయితే ఈ ఘటనతో కాపు సామాజిక వర్గంలో చేంజ్ కనిపించింది. అప్పటి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు కాపులు. కాపుల్లో టిడిపి ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలు కావడానికి తుని విధ్వంస ఘటన ఒకటి కారణం.
విశాఖ సభ వెనుక..
అయితే ఇప్పుడు రంగా సేన( Ranga Sena ) ద్వారా కాపులు రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. అదే విషయాన్ని వైసిపి అనుకూల మీడియా హైలైట్ చేస్తోంది. తద్వారా కాపు సామాజిక వర్గంలో చీలికను ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. విశాఖలో ఈరోజు జరుగుతున్న భారీ బహిరంగ సభకు ఎక్కువమంది వైసిపి సానుభూతిపరులే వెళ్తుండటం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి కాపులను సమీకరించినట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో వంగవీటి ఆశా కిరణ్ సైతం వైసీపీలో చేరుతారని ఒక ప్రచారం ఉంది. కూటమిలో కాపులు దూకుడుగా ఉన్నారు . దానికి కళ్లెం వేయాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాపు సేన ద్వారా ప్రయత్నాలు చేస్తోందన్న టాక్ ఉంది. అప్పట్లో తుని రైలు విధ్వంసం మాదిరిగానే.. ఈ సభతో టిడిపి పట్ల కాపుల్లో వ్యతిరేకత ప్రారంభమవుతుందని ఆశిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.