Nara Bhuvaneswari political entry: నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. నందమూరి తారక రామారావు కుమార్తెగా, చంద్రబాబు నాయుడు సతీమణిగా సుపరిచితులు ఆమె. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పర్యటనలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా మారిన నేపథ్యంలో తరచు అక్కడ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు భువనేశ్వరి. చాలా ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే అక్కడ సొంత నివాసం కూడా లేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసేవారు. దానికి చెక్ చెబుతూ కుప్పంలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. భువనేశ్వరి తరచు అక్కడకు వెళ్తూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటూ ఉంటారు. మొన్ననే ఆమె కుప్పం వెళ్లి వచ్చారు. తాజాగా తన తండ్రి సొంత గ్రామం నిమ్మకూరులో పర్యటిస్తున్నారు భువనేశ్వరి. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభం అయింది. అయితే మరోవైపు మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి విషయంలో సైతం ఇటువంటి ప్రచారం వచ్చింది. దానిపై ఆమె క్లారిటీ ఇచ్చారు కూడా.
స్వగ్రామం సందర్శన..
స్వర్గీయ నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) సొంత గ్రామం నిమ్మకూరు. కృష్ణాజిల్లాలోని పామర్రు మండలంలో ఉంటుంది ఈ గ్రామం. అయితే తరచూ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. గతంలో నందమూరి బాలకృష్ణ సైతం ఈ గ్రామాన్ని సందర్శించారు. తాజాగా నారా భువనేశ్వరి ఆ గ్రామాన్ని సందర్శించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులతో మమేకమయ్యారు. వారితో ముచ్చటించారు. నారా భువనేశ్వరి రాకతో గ్రామంలో సందడి నెలకొంది. అయితే తరచూ ఇలా భువనేశ్వరి పర్యటనలు చేస్తుండడంతో పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల చర్చ నడుస్తోంది.
భర్త అరెస్టు సమయంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు( CM Chandrababu) అరెస్టయ్యారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి ధైర్యంతో ముందుకు సాగారు. చంద్రబాబును 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ సమయంలో భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉండిపోయారు. తన భర్తను అకారణంగా అరెస్టు చేశారంటూ నాడు భువనేశ్వరి న్యాయం గెలవాలి అంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అయితే అంతవరకు ఆమె రాజకీయ వేదికలను పంచుకోవడం లేదు. కానీ భర్త ఇబ్బందుల్లో ఉండడంతో ఆమె బయటకు రావడం తప్పలేదు. వాస్తవానికి భువనేశ్వరి మంచి వ్యాపారవేత్త. చంద్రబాబు హెరిటేజ్ సంస్థలను ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వచ్చేసారు. ఆ కంపెనీల బాధ్యతను సుదీర్ఘకాలం చూశారు భువనేశ్వరి. బ్రాహ్మణి రావడంతో పూర్తి బాధ్యతలు ఆమెకు అప్పగించి కేవలం మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఆయన స్వగ్రామం నిమ్మకూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు భువనేశ్వరి. దీంతో ఆమె కృష్ణా జిల్లా నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె రాజకీయాల్లోకి రారు కానీ.. భర్త ప్రాతినిధ్య వహించే కుప్పం నియోజకవర్గ ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటున్నారు.