Homeఆంధ్రప్రదేశ్‌Minister Vishwaroop : వైసీపీ మంత్రికి పొగబెట్టారు.. అసలు కారణం ఇదే

Minister Vishwaroop : వైసీపీ మంత్రికి పొగబెట్టారు.. అసలు కారణం ఇదే

Minister Vishwaroop : మంత్రి పినిపె విశ్వరూప్ కు పొమ్మన లేక పొగపెడుతున్నారా? ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం అందులో భాగమేనా? అమలాపురం అల్లర్ల తరువాత ఎందుకు ప్రాధాన్యం తగ్గించారు? కనీసం ఆయన్న చూసేందుకు సైతం జగన్ ఇష్టపడడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల వైసీపీ లైన్ లోనే పవన్ పై విమర్శలు చేశారు. పవన్ సీఎం కావాలని తనకు ఆకాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో 175 సీట్లకు పోటీచేస్తే కదా అది సాధ్యమవుతుందని వ్యంగ్యంగా అన్నారు. కానీ మనసులో ఏదో పెట్టుకొని వైసీపీ అనుకూల మీడియా విశ్వరూప్ జనసేనలో చేరడం ఖాయమైందని ప్రచారం చేస్తోంది.

కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం గురించి తెలిసిందే. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆయన ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో తప్పిదాన్ని జనసేనపై వేసేందుకు కుట్ర చేశారు. కానీ ఓ కీలక నేత ఆదేశాలతోనే అంతటి విధ్వంసం జరిగిందని తరువాత ఆరోపణలు వెల్లువెత్తాయి. జనసేన అధ్యక్షుడు పవన్ సైతం స్పందించారు. ప్రభుత్వ పెద్దలపై కీలక ఆరోపణలు చేశారు. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్ మంచివారేనని.. అధికార పార్టీలోనే ఆయనపై కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే విశ్వరూప్ పై వైసీపీ హైకమాండ్ అనుమానపు చూపులు చూడడం ప్రారంభించింది.

అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మరోసారి పోటీకి సన్నద్ధమవుతున్నారు. కానీ టిక్కెట్ మొండిచేయి చూపించేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిన్నటివరకూ కుమారుడ్ని బరిలో దించాలని చూసినా.. కుటుంబంలో మారిన పరిస్థితులతో మరోసారి తానే పోటీచేయాలని విశ్వరూప్ డిసైడయ్యారు. ఇంతలో పార్టీ స్వరం మారింది. అమలాపురం అల్లర్ల తరువాత విశ్వరూప్ గురించి పట్టించుకునే వారు లేరు. ఇటీవల అనారోగ్యానికి గురైన సందర్శించిన పాపాన పోలేదు. టిక్కెట్ ఎగ్గొట్టేందుకే పెద్దలు పొమ్మన లేక పొగ పెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

వారాహి యాత్రలో భాగంగా పవన్ వైసీపీ నేతలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర వైసీపీ నేతల మాదిరిగా విశ్వరూప్ కూడా స్పందించారు. పవన్ ఎలా సీఎం అయిపోతారని ప్రశ్నించడంలో భాగంగా వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు 175 సీట్లకు పోటీచేయకుండానే సీఎం అవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. తనకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉందని.. అందుకైనా అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలని విశ్వరూప్ సెటైర్ వేశారు. అయితే అప్పటికే విశ్వరూప్ ను బయటకు పంపించేయ్యాలన్న ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆయన జనసేనలో చేరడం ఖాయమని నిర్ధారిస్తూ వార్తలు రాయిస్తున్నారు. కేవలం వైసీపీ అనుకూల మీడియాలో ఇటువంటి కథనాలు వస్తుండడం విశేషం.

వైసీపీలో వెనుకబడిన ఆ 18 మంది బాధితుల్లో మంత్రి విశ్వరూప్ ఉన్నట్టు మీడియాకు లీకులిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌటే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా విశ్వరూప్ ను వదిలించుకోవడానికే ఇటువంటి చర్యలకు వ్యూహకర్తలు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో విశ్వరూప్ కుమారుడు చర్చలు పూర్తయ్యాయని కథనాలు వండి వార్చి ప్రచారం చేస్తున్నారు. వీటిని అర్ధం చేసుకోలేనంత అమాయకుడు మంత్రి విశ్వరూప్ కాదు. దీనిపై ఆయన ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version