Arun Karthik TNPL: నాయకుడంటే ముందుండి నడిపించేవాడు మాత్రమే. అది ఆటలో అయినా, మరో రంగంలో ఆయన. లీడ్ చేసే వ్యక్తి మిగిలిన సభ్యులతో పోలిస్తే అత్యంత సామర్థ్యం కలిగిన వాడై ఉండాల్సిన అవసరం లేదు. కానీ, జట్టును ముందుకు నడిపించే విధానంలో సరైన ఆలోచన కలిగిన వాడై ఉండాలి. అవసరమైన సందర్భాల్లో తన స్థాయికి మించిన రాణించే తెగువ ఉండాలి. క్రికెట్ లో అయితే జట్టును నడిపించే సారధి ఈ లక్షణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే అతి కొద్ది మంది కెప్టెన్లు మాత్రమే సారధిగా వ్యూహాలతో పాటు.. ఆటగాడిగాను అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు అపురూప విజయాలను అందించి పెడుతూ ఉంటారు. ఈ కోవలోకి వస్తాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో నెల్లాయ్ రాయల్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్న అరుణ్ కార్తీక్.
కెప్టెన్ అంటే జట్టును నడిపించేవాడు. వ్యూహాలతో జట్టుకు విజయాన్ని అందించడంతోపాటు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనలోని బ్యాటింగ్ సామర్థ్యాన్ని బయటపెట్టి గొప్ప విజయాలను అందించాలి. అవసరమైతే ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాలి. అదే పని చేశాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోని నెల్లాయ్ రాయల్ కింగ్స్ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న అరుణ్ కార్తీక్. ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించి పెట్టాడు.
ఆసక్తికరంగా సాగిన మ్యాచ్..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెపాక్ సూపర్ గిల్లిస్, నెల్లాయ్ రాయల్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు కెప్టెన్ నారాయణ జగదీష్ దుర్గా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాపార్డర్ విఫలమైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన మాజీ సీఎస్కే స్టార్ అపరాజిత్ (79) మెరుగైన స్కోర్ చేయడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ కింగ్స్ కు కెప్టెన్ అరుణ్ కార్తీక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో భారీ స్కోర్ చేశాడు.
సెంచరీతో కదం తొక్కి జట్టుకు విజయాన్ని అందించి..
కెప్టెన్ అరుణ్ కార్తీక్ తొలి నుంచి బౌలర్ల పై విరుచుకు పడడంతో భారీగా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐదు సిక్సులు, 10 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గట్టు విజయానికి ఆరు పరుగుల అవసరం కాగా భారీ సిక్సు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అరుణ్ కార్తీక్ కు శ్రీ నిరంజన్ (24), రితిక్ ఈశ్వరన్ (26) నుంచి మంచి సహకారం అందింది. దీంతో మరో ఏడు పంతులు మిగిలి ఉండగానే 160 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. అరుణ్ కార్తీక్ విధ్వంసం ముందు ఎవరు నిలవలేకపోయారు.