YCP: అందరి సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులకే దిక్కు లేకుండా పోతోంది. వారి సమస్యలకు పరిష్కార మార్గం దొరకడం లేదు. ఏ ప్రభుత్వంలోనూ న్యాయం జరగడం లేదు. ప్రజాస్వామ్యానికి నాలుగు పునాదుల్లో.. ఒక పునాదిగా ఉన్న మీడియాలో పనిచేసే వారికి సరైన ప్రభుత్వ భరోసా లేకుండా పోతోంది.చాలీచాలని జీతాలతో.. యాజమాన్యం పెట్టిన ఇబ్బందులతో.. ఉద్యోగ భద్రత లేని.. విధి లేని పరిస్థితుల్లో జర్నలిస్టులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలపరంగా గుర్తింపు కార్డులు, ఆర్టీసీ బస్సు పాసు తప్ప.. మరి ఏ ఇతర ప్రయోజనం దక్కడం లేదు. సంక్షేమాన్ని పోటీపడి అమలు చేస్తామన్న రాజకీయ పార్టీలు.. జర్నలిస్టుల విషయానికి వచ్చేసరికి హ్యాండిస్తున్నాయి. ఎన్నికల ముంగిట మభ్యపెట్టడం.. తరువాత మరిచిపోవడం ఆనవాయితీగా మారుతోంది.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ ఏవిధంగా చేసిందో.. ఇప్పుడు జగన్ సర్కార్ దానినే అనుసరించింది. సరిగ్గా 2019 ఎన్నికల ముంగిట జర్నలిస్టుల ఇల్లు,ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక జీవో జారీ చేశారు. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు.ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. ఆ ప్రక్రియ మరుగున పడిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్. గత ఐదేళ్లుగా జర్నలిస్టుల గురించి పట్టించుకోకుండా.. ఎన్నికలకు రెండు నెలల ముందు ఇదిగో స్థలాలు ప్రక్రియ ప్రారంభించారు. వేలాది మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. వారానికి ఒకసారి ఒక అప్డేట్ ఇచ్చేవారు. ఇలా దరఖాస్తుల ప్రక్రియకి రెండు నెలలు పూర్తయింది. తీరా ఎన్నికల కోడ్ ప్రకటించేసరికి ఈ దరఖాస్తులన్నీ చెత్త బుట్టలోకి చేరిపోయాయి.
మాటలు చెప్పడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే ముందంజలో ఉంటారు పేర్ని నాని. ఆయన సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి.ఆయన మచిలీపట్నం నియోజకవర్గానికి చెందినవారు. జర్నలిస్టులంటే ఆయనకు మహా ప్రేమ. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం కలెక్టరేట్లో ఉండాల్సిన జర్నలిస్టుల దరఖాస్తుల ఫైలు చెత్త కుప్పలో కనిపించింది. జర్నలిస్టులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో.. సమాచార శాఖ డిడిని కలిశారు. కానీ ఆ ఫైల్ పోయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఒక్క మచిలీపట్నంలోనే కాదు.. ఏ జిల్లాలో కూడా ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా జర్నలిస్టులకు మంజూరు చేయలేదు. ఇళ్ల స్థలాలను కేటాయించలేదు. మండలాల్లో పనిచేసే రిపోర్టర్లు వేతనం 2000 రూపాయలు లోపే.ఇక స్టాప్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల సైతం తూతూ మంత్రపు వేతనాలతో నెట్టుకొస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో పని చేస్తూ.. సొంత ఇల్లు లేక సతమతమవుతున్నారు.సమాజంలో గౌరవంగా బతకడానికి అవసరమైన ఆదాయం లేక.. మరో ప్రత్యామ్నాయం కనిపించక ఉన్న వృత్తిలోనే కొనసాగుతూ ఇబ్బందులు పడుతున్నారు.అటు యాజమాన్యాలు సైతం పట్టించుకోవడం లేదు.ఇటు ప్రభుత్వాలు వారి సమస్యలను దాటవేస్తూ వస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి… వైసిపి అధికారంలోకి వస్తే సాక్షి మీడియా మాత్రమే బాగుపడుతోంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు దండిగా ఆదాయం లభిస్తోంది. కానీ వాటిలో పనిచేసే జర్నలిస్టులు నిత్య బాధితులే. వారికి ఏ ప్రభుత్వము స్వాంతన చేకూర్చడం లేదు. జర్నలిస్టుల విషయంలో అన్ని ప్రభుత్వాల వ్యవహార శైలి అలానే ఉంది.