Gudivada MLA
Gudivada MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (vinegandla Ramu) చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.. ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే ప్రజల్లోకి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు.. అయితే ఆయన బైక్ పై వెళ్తుండగా కొంతమంది వీడియో తీసి.. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.. గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాముకు ప్రభుత్వం వ్యక్తిగత భద్రత సిబ్బంది కేటాయించింది. వ్యక్తిగత సిబ్బందిని కూడా నియమించింది. అయితే రాము మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వీధుల్లో తిరుగుతూ ప్రజలతో ముచ్చటిస్తున్నారు.. వెనిగండ్ల రాము ” ప్రజలారా ప్రశ్నించండి.. మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మీకోసమే పని చేస్తుందనే” క్యాంపెయిన్ ప్రారంభించారు. ద్విచక్ర వాహనంపై గుడివాడ వీధుల్లో తిరుగుతూ.. అంగరక్షకులు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే రాము పర్యటించారు. వీధుల వెంట చిరు వ్యాపారులు, దుకాణదారులు, టీ స్టాల్స్, హోటళ్ల వద్దకు వెళ్లారు. ప్రజలతో ముచ్చటించారు.. అయితే రాము తను వెళ్తున్నప్పుడు అధికారులు, ఇతర సిబ్బందిని తన వెంట రానివ్వకుండా చూసుకున్నారు.. ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి.. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు..” నన్ను మీరు ఎన్నుకున్నారు. మీకు, నాకు మధ్య దళారులు అవసరం లేదు. మధ్యవర్తులు ఉండాల్సిన పనిలేదు. అందుకోసమే మీ వద్దకు వచ్చేశాను. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాను. మీరు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చాననే భావిస్తున్నానని” రాము పేర్కొన్నారు.
డబ్బులు వసూలు చేస్తున్నారు
ఇటీవల కాలంలో గుడివాడలో టిడిపి నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించడం మొదలుపెట్టాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీ చెందిన మీడియా ప్రధానంగా కథనాలను ప్రసారం చేసింది. అయితే ఇందులో నిజా నిజాలు ఏమిటో తెలుసుకోవడానికి రాము క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయన అన్ని వర్గాల ప్రజలను ఈ విషయంపై అడిగారు. అయితే వారంతా ఎటువంటి డబ్బులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలు, ఇతర పనులకు సంబంధించి ఎవరైనా లంచాలు అడిగితే.. తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని రాము ప్రజలకు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.. ఇక రాము పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న మీడియా ఆయన వద్దకు వెళ్లగా.. కవరేజ్ వద్దని సున్నితంగా రాము తిరస్కరించారు..” నేను గుడివాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో రాజకీయ కోణం లేదు. దయచేసి దీనిని వేరే విధంగా భావించవద్దు. నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ప్రజల కోసం నేను నేరుగా వచ్చేశాను. వారి వద్దకు చేరుకున్నాను. వారి సమస్యలు మొత్తం నోట్ చేసుకున్నాను. పరిష్కరించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నానని” రాము ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.
ప్రజలారా ప్రశ్నించండి.. మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందంటూ ద్విచక్ర వాహనంపై గుడివాడ వీధుల్లో తిరిగిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు.
గన్ మ్యాన్, వ్యక్తిగత సిబ్బంది లేకుండా పర్యటించిన ఎమ్మెల్యే గారు.
రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు, దుకాణదారులు, టీ… pic.twitter.com/OV38OQTdRP— Venigandla Ramu (@RamuVenigandla) January 30, 2025