Chandrababu: చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ

మదనపల్లి నుంచి వచ్చిన నందిని చంద్రబాబును చూసేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ చంద్రబాబు బిజీగా ఉండడంతో కలవలేకపోయారు. ఈ తరుణంలోనే కాన్వాయ్ వెంటపడినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : June 11, 2024 4:34 pm

Chandrababu

Follow us on

Chandrababu: ప్రజాభిమానంతో చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు కూటమి పక్ష నేతగా ఎన్నికయ్యారు. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పవన్ భావోద్వేగ ప్రకటన చేశారు. చంద్రబాబు చేతులు పట్టుకొని మీరు దృఢమైన వారు అంటూ.. నాడు అక్రమ కేసులు చంద్రబాబు జైలులో ఉన్న నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నాడు భువనేశ్వరి బాధపడుతుంటే ఓదార్చానని.. మంచి రోజులు వస్తాయని చెప్పానని.. అలానే మంచి రోజులు వచ్చాయని.. అందుకే మంచి పాలన అందించాలని చంద్రబాబును కోరారు. దీంతో హాల్ అంతా నిశ్శబ్దంతో ఉండిపోయింది.

మరోవైపు సమావేశం అనంతరం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమావేశం అనంతరం ఉండవెల్లికి చంద్రబాబు ప్రయాణం అయ్యారు. కాన్వాయ్ సైతం బయలుదేరింది. ఈ క్రమంలో ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరకు పిలిచారు. తన పేరు నందిని అని.. తమరిని చూసేందుకు వచ్చానని ఆమె చెప్పారు. సెక్యూరిటీ నివారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మదనపల్లి నుంచి వచ్చిన నందిని చంద్రబాబును చూసేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ చంద్రబాబు బిజీగా ఉండడంతో కలవలేకపోయారు. ఈ తరుణంలోనే కాన్వాయ్ వెంటపడినట్లు తెలుస్తోంది. కష్టం ఫలించి.. మా కోరిక మేరకు సీఎం అయ్యారు సార్.. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతానని ఆ మహిళ ప్రాధేయపడింది. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్న చూడడానికి వచ్చానని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అయితే కాన్వాయ్ వెంట ఆ మహిళ పరుగు పెడుతున్న తీరు, చంద్రబాబు ఆమెతో వ్యవహరించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.