Pawan Kalyan : ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని బెదిరించాడంటే వాడికి ఎంత గట్స్ ఉండాలి. ఏకంగా ఆంధ్రా నేలపైనే ఉండి మరీ బెదిరించాడంటే ‘వాడు మగడ్రా బుజ్జి’ అనాలా.. లేక వాడికి మూడింది అనాలా.. అసలు ఆంధ్రాలో రాజకీయం ఏ స్థాయిలో ఉందో పార్టీల మధ్య వైషమ్యాలు ఏ లెవల్ కు చేరాయో.. పవన్ అంటే పగోళ్లకు ఎంత పడదో ఈ ఘటన రుజువు చేసింది. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కే బెదిరింపుల స్తాయికి ఏపీ సమాజం పెచ్చరిల్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి అనూహ్యంగా బెదిరింపు కాల్స్ వచ్చాయి . చంపేస్తామని ఓ ఆగంతకుడు ఫోన్ కాల్ ద్వారా హెచ్చరించాడు. చెప్పలేనటువంటి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ ఆగంతకుడు సందేశాలు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, సందేశాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సైతం సమాచారం అందించారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్‌పై హోంమంత్రి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావుతో చర్చించారు. ఆగంతుకుడి నుంచి పవన్ కల్యాణ్ పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని అనితకు డీజీపీ వివరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. బెదిరింపు కాల్స్‌పై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆగంతకుడు 950550556 నంబర్ నుంచి పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. గతంలో ఇదే నంబర్ నుంచి హోంమంత్రి అనితకు కూడా ఫోన్లు వచ్చాయని తేల్చేశారు. ఈ నంబర్ మల్లికార్జునరావు అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇది ఇలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉంటున్న మల్లికార్జున్‌గా వారు గుర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గాలింపు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్, మెసేజ్‌లు వచ్చినట్లు వారు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు లబ్బిపేటకి వెళ్లే సరికే నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఆయన అడ్డుకున్నారు. ఓ భారీ షిప్ లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనల అనంతరం పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ పవన్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.