TDP school of politics: తెలుగుదేశం( Telugu Desam) పార్టీని ఒక రాజకీయ పాఠశాల అంటారు. 1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. 9 నెలలకే ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రెండేళ్లకే ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయడంతో ఆయన ఎన్నికలకు వెళ్లారు. ఉమ్మడి ఏపీ ప్రజలు ఆయన పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత బడుగులకు అవకాశం దక్కింది. అప్పటివరకు ఒక వర్గానికి మాత్రమే పదవులు వచ్చేవి. కానీ టిడిపి వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులుగా ఎదిగారు. రాష్ట్రం విడిపోయినా.. రెండు రాష్ట్రాలను పాలించేది ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంతలా ప్రభావం చూపింది తెలుగుదేశం. నాయకత్వ లక్షణాలను తయారుచేసి రాజకీయ పాఠశాలగా తెలుగుదేశం పార్టీని ఎక్కువమంది అభివర్ణిస్తారు. ఇప్పుడు కూడా ఆ ఒరవడిని గౌరవిస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికీ అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో ఒక దృశ్యం చూస్తే అందర్నీ ఆకట్టుకుంటుంది. పార్టీ నేతల మధ్య కూర్చుని చంద్రబాబు శిక్షణ శిబిరాలను ఆసక్తిగా గమనించడం మాత్రం విశేషం.
శిక్షణ శిబిరం ఏర్పాటు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణుల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా చేసి వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధివిధానాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అవగాహన కల్పించారు సీనియర్ నేతలతో. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. కేంద్ర కమిటీ కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ ఈ శిక్షణ తరగతులు కొనసాగాయి. కార్యక్రమానికి హాజరైన వారికి అక్కడే భోజనం, టీ, కాఫీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం హాజరయ్యారు.
వెనుక వరుసలో కూర్చుని
సాధారణంగా పార్టీ అధినేత అంటే ముందు వరుసలో కూర్చుంటారు. వేదికపై ఆసీనులవుతారు. కానీ చంద్రబాబు( CM Chandrababu) మాత్రం చివరి వరుసలో కూర్చి వేసుకుని కూర్చున్నారు. తన సెల్ ఫోన్ ను పక్కనపెట్టి పూర్తిగా శ్రద్ధగా తరగతిని వినడం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ స్వరూపం, ఎదురయ్యే భవిష్యత్తు సవాళ్లు, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అయితే ప్రతి విషయాన్ని చంద్రబాబు ఆసక్తిగా వినడం కనిపించింది. ప్రత్తిపాటి పుల్లారావు క్లాస్ కొనసాగిస్తుండగా చంద్రబాబు చేరుకున్నారు. దీంతో చంద్రబాబు అవగాహన కల్పిస్తారని భావించారు అక్కడ ఉన్న నేతలు. కానీ చంద్రబాబు మిగతా నేతలతో కూర్చి వేయించుకొని ఆసక్తిగా వినడం మాత్రం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. చంద్రబాబు చర్యలను అక్కడ ఉన్నవారు ఫిదా అయ్యారు.