Agrigold land issue  : సర్వే నంబర్లను మార్చారు.. ఫోర్జరీ చేశారు.. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు

భూ యజమానుల పేరుతో సంతకాలు ఫోర్జరీ చేశారు. సర్వే నెంబర్లను మార్చేశారు. ఎంచక్కా అధికారుల సహకారంతో అదే భూమిని విక్రయించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Written By: Dharma, Updated On : August 20, 2024 3:30 pm

Agrigold land issue

Follow us on

Agrigold land issue : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. కేవలం అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయడమే కాదు.. అధికారుల సహకారంతో ఫోర్జరీ చేశారన్న ఆరోపణ బయటకు వచ్చింది. ఈ కేసులో మాజీమంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్, పెదనాన్న వెంకటేశ్వరరావులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాము ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదని జోగి రమేష్ తొలుత చెప్పుకొచ్చారు. అయితే అందరి మాదిరిగానే తాము భూములు కొనుగోలు చేసినట్లు రాజీవ్ ఒప్పుకున్నాడు. అటు తర్వాత జోగి రమేష్ సైతం మాట మార్చాడు. ఈ నేపథ్యంలో అధికారుల సహకారంతో జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేసిన భూమిని.. తిరిగి విక్రయించినట్లు తెలుస్తోంది. ఏకంగా సర్వే నెంబరు మార్పుతో పాటు సంతకాలు సైతం ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఏసీబీ అధికారులు పట్టు బిగిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి జోగి కుటుంబం తతంగం నడిపించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురంలో 10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన విషయంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేసినట్లు చెబుతున్న 2160 గజాల స్థలాన్ని వైసీపీకి చెందిన కార్పొరేటర్ చైతన్య రెడ్డి కుటుంబానికి విక్రయించారు. అయితే ఈ భూమి సర్వే నంబర్ 88 లో కొనుగోలు చేయగా.. సర్వే నంబర్ 87 లో ఉన్నట్లుగా లేఖ పొంది.. సబ్ రిజిస్టర్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో తేలింది.

* జరిగింది ఇది
సర్వే నంబర్ 88 లో ఉన్న నాలుగు ఎకరాలు బొమ్మ వెంకట చలమారెడ్డి పేరుపై ఉండేది. దీనిలో ఎకరం స్థలం పోలవరపు మురళీమోహన్ కు, మరో ఎకరం అద్దేపల్లి కిరణ్ కుమార్ కు, మిగతా రెండు ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారు. ఇవన్నీ సర్వే నంబర్ 88 లోనే ఉన్నాయి. అయితే ఇందులో పోలవరపు మురళీమోహన్ జోగి వెంకటేశ్వరరావు, రాజీవ్లకు విక్రయించినట్లు 2022లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరపు మురళీమోహన్ కు కూడా నిందితుడిగా చేర్చింది. అయితే తాను జోగి కుటుంబానికి భూములు అమ్మలేదని.. అవి నకిలీ డాక్యుమెంట్లుగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాదిరిగానే డాక్యుమెంట్లలో మురళీమోహన్ ఆధార్ నెంబర్ తప్పుగా కనిపిస్తోంది.

* కొను’గోల్ మాల్’
అయితే ఇంతవరకు జోగి కుటుంబం సక్రమంగానే భూములు కొనుగోలు చేసిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు నకిలీ పత్రాలతో భూములు కొనుగోలు చేశారని తేలడం కొత్త మలుపు తిరిగింది. దీని వెనుక అప్పటి మంత్రి జోగి రమేష్ అధికార దుర్వినియోగం ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే జోగి రమేష్ పాత్ర పై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా జోగి రమేష్ పై కేసు నమోదు చేయడం ఖాయం.

* అది పెద్ద నేరమే
అయితే జోగి కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేయడమే కాదు.. సర్వే నెంబర్ మార్చి భూమిని విక్రయించడం పెద్ద నేరమే అవుతుంది. ఈ విషయంలో గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా.. అసలు తాను సర్వే చేయలేదని చెబుతున్నారు. వాస్తవానికి సర్వే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేయాలి. కానీ ఈ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఫోర్జరీ చేశారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. అందుకే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసులో అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.