Botsa Satyanarayana : తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ. హేమా హేమీలను దాటుకొని ఈ స్థాయికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అలంకరించారు. ఒకానొక దశలో ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు. అయితే అనూహ్యంగా ఆ పదవి రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. ఎక్కడో విజయనగరంలో కోపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ప్రస్తానాన్ని ప్రారంభించి.. అనతి కాలంలోనే ఎదిగారు బొత్స. 1999లో బొబ్బిలి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, కొనిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొత్స వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి చీపురుపల్లి నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచారు. దీంతో జగన్ ప్రత్యేకంగా బొత్సను పిలిపించుకున్నారు. అప్పటివరకు సీనియర్లుగా ఉన్న వారిని పక్కకు తప్పించి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపులో బొత్స కీలక భాగస్వామ్యం అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి,వై వి సుబ్బారెడ్డిపాత్ర పెరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి వారి సేవలను జగన్ వినియోగించుకోలేదు. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. అది గుర్తించిన జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
* ఎమ్మెల్సీగా ఎన్నిక
తాజాగా బొత్స విశాఖ శాసనమండలి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఇప్పటికే ఏకపక్ష విజయంతో టీడీపీ కూటమి దూకుడుగా ఉంది. అయితే మెజారిటీ ఉన్న ఎమ్మెల్సీ పై పోటీకి టిడిపి కూటమి ఆసక్తి చూపలేదు. భారీ విజయం దక్కించుకున్న వేళ.. ఒక ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడడం అంత మంచిది కాదని హుందాగా పోటీ చేయలేదు చంద్రబాబు. దీంతో ఎమ్మెల్సీగా బొత్స ఎన్నికయ్యారు. పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.
* వైసిపికి ఇబ్బందికరమే
అయితే బొత్స రాకటిడిపి కూటమి కంటే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం ఉంది. బొత్స రాష్ట్ర స్థాయి నాయకుడు. తప్పకుండా శాసనమండలిలో వైసీపీ పక్ష నేత పదవి అడుగుతారు.ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. 39 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభ పక్ష నేత అంటే క్యాబినెట్ హోదా తో సమానం. శాసనసభలో వైసిపికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు డిమాండ్ చేసిన స్పీకర్ లెక్క చేయలేదు. భవిష్యత్తులో సైతం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
* లేళ్ల అప్పిరెడ్డిని తప్పిస్తారా
శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని జగన్ నియమించారు. అయితే ఆయనపై రౌడీ ముద్ర ఉంది. గుంటూరులో రౌడీయిజం చెలాయించారని కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి కింద బొత్స పనిచేసే చాన్స్ లేదు. కచ్చితంగా శాసనమండలి పక్ష నేతగా పదవి కావాలని పట్టుబడతారు. అయితే జగన్ ఆ పదవి ఇస్తానని చెప్పి బొత్సను పోటీలో పెట్టారు. కచ్చితంగా ఆ పదవి కేటాయించాల్సి ఉంటుంది. అదే జరిగితే జగన్ కంటే ప్రోటోకాల్ ప్రకారంగా క్యాబినెట్ హోదాను బొత్స దక్కించుకుంటారు. అది జగన్ కు ఇబ్బందికరమే. అందుకే బొత్స విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.