Anil Kumar Yadav : రాజకీయాలంటే ప్రజాసేవ. ఈ తలంపుతోనే చాలా మంది రాజకీయాల్లోకి వస్తుంటారు. వచ్చిన తరువాత పొల్యూట్ అవుతుంటారు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఇది కామన్. సంపాదన గురించే రాజకీయాలన్నట్టు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అయితే తాను అటువంటి వాడిని కాదని అంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఆస్తులను తగలెట్టుకున్నానని చెబుతున్నారు. ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు పాడుచేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా విలేఖర్ల సమావేశం నిర్వహించి మరీ తన అప్పులు, ఆస్తులు గురించి ప్రకటింటారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రం నెల్లూరులో కొనసాగుతోంది. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి ప్రభాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లతో పాటు టీడీపీ కీలక నాయకుల చొరవతో భారీ జన సమీకరణ నడుమ లోకేష్ యాత్ర సాగుతోంది. నెల్లూరులో జన సందడి చూసి లోకేష్ హుషారుగా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై పొలిటికల్ పంచ్ లు విసురుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై స్పందించారు. మూడేళ్ల మంత్రి పదవితో రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో దీనిపై అనీల్ కుమార్ తెగ గింజుకున్నారు.
లోకేష్ ఆరోపణలు చేసిన మరుసటి రోజునే అనీల్ రంగంలోకి దిగారు. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తాను మంత్రి అయిన తరువాత రూ.2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూషన్ తో తన సైట్ ను అమ్ముకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ సొమ్ముతోనే వేరే చోట స్థలం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇస్కాన్ లో తమ కుటుంబానికి ఇస్కాన్ సిటీలో 18 ఎకరాల ఆస్తి ఉండేదని.. కానీ ప్రస్తుతం ఉన్నది 3.98 ఎకరాలు మాత్రమేనన్నారు. పసుపుకుంకాల నిమితం తన భార్యకు హైదరాబాద్ లో 8 సెంట్ల స్థలం ఉందని.. అంతకు మించి ఆస్తులు లేవన్నారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ అన్వేషించినా తనకు సెంటు భూమి ఉండదన్నారు.
నా నిజాయితే నన్ను గెలిపించిందని గుర్తుచేశారు. 2016లో ఇటువంటి ఆరోపణలు చేస్తే అమ్మవారి గుడిలో ప్రమాణం చేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. నాడు నిజాయితీగా ఉండడం వల్లే 2019లో గెలిచి మంత్రిని అయ్యానని అనీల్ చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేసిన లోకేష్ నెల్లూరు వెంకటేశ్వరాలయంలో ప్రమాణానికి రాగలరా అని ప్రశ్నించారు. అమరావతిలో బినామీల పేర్లతో ఆస్తులు లేవని.. కాలేజీ ఫీజులు పెంచి దోపిడీ చేయలేదని మాజీ మంత్రి నారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై మరోసారి ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని అనీల్ హెచ్చరించారు. అయితే రూ.100 కోట్ల ఆస్తులు పోగొట్టుకోవడంపై మాత్రం నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. రాజకీయాల్లో మరీ మంచితనం పనికి రాదని సెటైర్లు వేస్తున్నారు.