Amaravati development: అమరావతి( Amaravathi capital ) విషయంలో మరో కొత్త అడుగు పడింది. రాజధానికి కీలకమైన ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెగ హడావిడి నడుస్తోంది. ముఖ్యంగా రవాణా ప్రాజెక్టుల విషయంలో ముందడుగు పడుతూ వస్తోంది. అయితే తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది జాతీయ రహదారుల సంస్థ. ఇది గాని కార్యరూపం దాల్చితే అమరావతికి కొత్త రూపు వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ మరింత ఊపొందుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత అమరావతిలో రియల్ భూమ్ పెరిగింది. అయితే భూములు ధరలు అయితే పెరిగాయి కానీ.. కొనుగోలు పెరగడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక విధంగా శుభపరిణామమే.
అప్పట్లో విపరీతంగా..
దాదాపు ఐదేళ్లపాటు అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. చంద్రబాబుపై ( AP CM Chandrababu) ఎంతో నమ్మకంతో చాలామంది రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చి కొనుగోలు చేసిన వ్యాపారుల సైతం ఉన్నారు. కానీ ఐదేళ్ల కాలంలో వైసీపీ అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగించింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారంతా నిరాశకు గురయ్యారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతాయని అంచనా వేశారు. కానీ నిర్మాణాలకు ప్రధానంగా ఉండాల్సింది రవాణా మార్గం. ఇప్పుడు అదే అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఏయే రైతు నుంచి భూమి సేకరించాలో నోటిఫికేషన్ లో చెప్పడంతో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చుట్టుపక్కల ఐదు జిల్లాల్లో..
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(Amaravathi Outer Ring Road) నిర్మాణం అనేది రాజధాని చుట్టుపక్కల ఐదు జిల్లాల్లో చేపట్టాలన్నది ప్రణాళిక. దాదాపు 190 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. నాలుగు వేల ఎకరాల వరకు భూమిని సేకరించనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దదిగా ఇది నిర్మించనున్నారు. ఈ ఒక్క ఔటర్ రింగ్ రోడ్డు తోనే అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అమరావతి రాజధాని కి ఒక మణిహారమే. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిన మరుక్షణం ఈ ప్రాంతంలో లెక్కలు మారుతాయి. భూముల ధరకు రెక్కలు వస్తాయి.