Annadata Sukhibhava: ఏపీ ప్రభుత్వం( AP government ) నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. దీపావళి కానుక రైతులకు రూ.7000 అందించనుంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం పిఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సిద్ధపడుతుండడంతో.. అదేరోజు అన్నదాత సుఖీభవ రెండో విడత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. అక్టోబర్లో దీపావళి సమయంలోనే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రం పిఎం కిసాన్ అక్టోబర్ 18న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే జరిగితే కేంద్రం అందించే రూ.2 వేలకు తోడు.. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 వేల తో కలిపి రూ.7000 రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయం వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: టీవీ5 సాంబ సార్ క్రికెట్ పాఠాలు.. నేర్చుకోండయ్యా?
* హామీ ఇచ్చినట్టుగానే..
రైతులకు సాగు ప్రోత్సాహం కింద అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava) పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. ఎంతకు ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం ఏటా 6000 రూపాయల సాయాన్ని అందిస్తూ వస్తోంది. పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో 2000 రూపాయల చొప్పున అందిస్తూ వచ్చింది. వైసిపి ప్రభుత్వం రైతు భరోసా పేరిట అమలు చేసింది. కేంద్రం అందించే మూడు విడతల సాయంతో కలిపి రూ.7500 అందించింది. అంటే రైతులకు ఏడాదికి రూ.13,500 అందేది. అయితే తాము మాత్రం కేంద్రంతో కలిపి రూ.20,000 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతం మాదిరిగా మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు రెండున పిఎం కిసాన్ రెండువేల తో పాటు 5000 రూపాయలను కలిపి అందించారు. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత అందించేందుకు పీఎం కిసాన్ తేదీని ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం. అదే విడతలో మరో ఐదు వేల రూపాయలు కలిపి.. మొత్తం రూ.7000 అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి కానుకగా ఈ మొత్తాన్ని అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* వ్యవసాయ మదుపుల కోసం
ప్రస్తుతం ఖరీఫ్( kharif) సీజన్ నడుస్తోంది. వ్యవసాయానికి సంబంధించి పనులు సాగుతున్నాయి. ఎరువులతో పాటు క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు. మరోవైపు వర్షాలు కూడా ఆశాజనకంగా పడుతున్నాయి. ఈ క్రమంలో సాగు పెట్టుబడుల కోసం అక్టోబర్లో రెండో విడత నిధులు అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే దీపావళి కానుకగా అక్టోబర్ 18న రెండో విడత పిఎం కిసాన్ సాయం అందించేందుకు కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. అది పూర్తయితే రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ ఇచ్చినట్టే. చివరి విడతలు కేంద్రంతో కలిపి రూ.6000 అందించాల్సి ఉంటుంది. తొలి రెండు విడతల్లో రూ.5000 చొప్పున రూ.10000.. చివరి విడతలో నాలుగు వేలు అందించి హామీ ఇచ్చిన మాదిరిగానే కేంద్రంతో కలిపి 20 వేల రూపాయలు రైతులకు అందించినట్టు అవుతుంది. మొత్తానికి అయితే మరో ఎన్నికల హామీని విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.