Sankranthi Special : పందెంలో ఓడిపోయిన కోడిని( chicken) ఏం చేస్తారు? అది కచ్చితంగా చనిపోతుంది కూడా? అయితే అది పందెంకోడి కావడంతో దాని మాంసం వేల రూపాయలు ఉంటుంది. కానీ వేలంపాటలో చనిపోయిన పందెం కోడిపుంజు ఏకంగా లక్షా 11 వేల 111 రూపాయలు పలకడం విశేషం. అంతలా ఆ కోడిలో ప్రత్యేకత ఏముందంటే.. అది వీరమరణం పొందిన కోజా పుంజు కావడమే దాని ప్రత్యేకత.
* జోరుగా మాంసం విక్రయాలు
గోదావరి జిల్లాల్లో( Godavari district ) సంక్రాంతి సంబరాలు ముగిసాయి. పెద్ద ఎత్తున నాలుగు రోజులపాటు కోడిపందాలు సాగాయి. ఇప్పుడు ఎవరికి వారుగా తమ స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు తిరుగు ముఖం పడుతున్నారు. అయితే కోడిపందాల్లో పాల్గొన్న పుంజుల మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వాటికి వేలం వేస్తున్నారు. ఒక్కోపుంజు వేలు, లక్షలు పలుకుతుండడం విశేషం. వాస్తవానికి బరిలో దిగిన పుంజుల్లో ఒకటి గెలుస్తుంది.. మరొకటి పోరాడి ఓడిపోతుంది. అలా ఓడిపోయి చనిపోయిన పుంజు వీరమరణం పొందినట్లు పందెం రాయుళ్లు భావిస్తారు. ఇక పందెం డబ్బుతో పాటు చనిపోయిన పుంజు సైతం గెలిచిన వారి సొంతం అవుతుంది.
* ఎవ్వరూ వదలరు
సాధారణంగా నాటు కోళ్లకు విపరీతమైన గిరాకీ. ఎంత ధర అయినా కొనుగోలు చేస్తాం. అటువంటిది పందెం కోళ్ల( chicken bets ) విషయంలో వెనక్కి అడుగు వేస్తామా? పందెం కోళ్లకు ఆరు నెలల ముందు నుంచే శిక్షణ ఇస్తారు. బలవర్ధకమైన ఆహారం పెడతారు. బాదంతో పాటు జీడిపప్పును ఆహారంగా పెడతారు. చికెన్, మటన్ కీమా తినిపిస్తారు. దీంతో కోడిపుంజు బలిష్టంగా తయారవుతుంది. అయితే పందెంలో చనిపోయిన కోడిని కోజాగా పిలుస్తారు. ఇలాంటి కోజా మాంసం ఎవ్వరికి పందెం రాయుళ్లు ఇవ్వరు.
* వేలంలో రికార్డు స్థాయిలో ధర
ఏలూరు( Eluru) ఎన్ఆర్ పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద, రాజవంశీలు కోడిపుంజులు పెంచుతారు. అయితే వారి కోడి పందెంలో ఓడిపోయింది. వాస్తవంగా ఆ పుంజు గెలిచిన వారికి సొంతం కావాలి. కానీ దాన్ని వారికి మళ్లీ డబ్బు చెల్లించి వెనక్కి తీసుకున్నాడు వంశీ. బరిలో తన పుంజు బలంగా పోటీ పడిందని.. దాని గొప్పతనం అందరికీ తెలిసే విధంగా చేయాలని చనిపోయిన ఆ కోడిని వేలంపాటకు పెట్టాడు. అయితే మాగంటి నవీన్ చంద్ర బోస్ అనే వ్యక్తి దానిని లక్ష 11 వేల 111 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇది ప్రస్తుతం చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.