AP Volunteers: వాలంటీర్లుగా వారికి మాత్రమే ఛాన్స్!

రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను.. లక్ష మందికి పైగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చాలా రకాల విమర్శలు చేశాయి.

Written By: Dharma, Updated On : June 19, 2024 10:08 am

AP Volunteers

Follow us on

AP Volunteers: ఏపీలో వాలంటీర్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు విధులు నిర్వహించారు. అయితే వీరంతా వైసీపీ సానుభూతిపరులేనని ఆ పార్టీ నేతలు బాహటంగానే చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో మీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈసీ స్పందించింది. వాలంటీర్లను పక్కన పెట్టాలని సూచించింది. అయితే చాలామంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. కొందరైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా మారారు. ఇప్పుడు వైసిపి అధికారం కోల్పోవడంతో వాలంటీర్లు మాట మార్చుతున్నారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని.. తమని కొనసాగించాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను.. లక్ష మందికి పైగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చాలా రకాల విమర్శలు చేశాయి. అయితే ఎన్నికల సమయంలో ఎదురైన పరిణామాలతో విపక్షాలు సైతం మాట మార్చాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పుకొచ్చాయి. వైసీపీ ఓడిపోవడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం మాట మార్చారు. తమకు అవకాశం ఇస్తే సేవలందిస్తామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు రాజీనామా చేయని వాలంటీర్లు సైతం తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుందని.. రాజీనామా చేయని వాలంటీర్ల సేవలను కొనసాగించాలని భావిస్తోందని చెప్పుకొచ్చారు.

అయితే వాలంటీర్ల వ్యవస్థను టిడిపి కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశలు చిగురించాయి. ఓ మంత్రికి వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలను అప్పగించడం విశేషం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి జీతాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని.. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. దీంతో ఆ మూడు పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన ఆశలు చిగురించాయి. అయితే గతం మాదిరిగా పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన వారు కాకుండా.. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికే వాలంటీర్ పోస్టులుఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రభుత్వం దీనిపై సీరియస్గా ఆలోచిస్తుందని స్వయంగా మంత్రి ప్రకటించడంతో.. త్వరలో వాలంటీర్ వ్యవస్థ పై ప్రత్యేక ప్రకటన వస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.