Jagan (1)
Jagan: వైసిపి( YSR Congress ) బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో.. రివర్స్ గేమ్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీ గూటికి వచ్చారు. ఆయన బాటలో మరి కొంతమంది ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఇన్చార్జులు యాక్టివ్ గా లేని చోట కొత్త వారిని నియమించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలను సైతం నిర్వహించడం లేదు. అటువంటి చోట కొత్త నేతలను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. సరైన నేత అయితే ఇంచార్జిగా నియమించేందుకు సిద్ధపడుతున్నారు.
* కొత్త వ్యక్తికి బాధ్యతలు గన్నవరం( Gannavaram) నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ మోహన్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో వల్లభనేని వంశీ మోహన్ రెచ్చి పోయారు. ఆయన అనుచరులు సైతం దందాలకు దిగారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన వంశీ మోహన్.. కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో ఏపీలో ఉండలేక అమెరికా వెళ్లిపోయారు. వరుస కేసుల్లో చిక్కుకొని ఆయన అనుచరులు సైతం జైలు పాలవుతున్నారు.
* నిలిచిన వైసిపి కార్యక్రమాలు
అయితే గన్నవరంలో వైసీపీ కార్యకలాపాలు జరగడం లేదు. దీంతో వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi Mohan ) మోహన్ స్థానంలో కొత్త నేత నియామకం అనివార్యంగా మారింది. వాస్తవానికి అక్కడ వైసీపీ ఇన్చార్జిగా యార్లగడ్డ వెంకట్రావు ఉండేవారు. కానీ వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలోకి ఫిరాయించిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆయన టిడిపిలోకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే యార్లగడ్డ వెంకట్రావును పట్టుకుని నిలబడే నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం. పైగా కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. అందుకే అటువంటి నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
* పద్మశ్రీ కి బాధ్యతలు
కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. పిసిసి మాజీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ( Shunkara Padmashree ) త్వరలో వైసిపి గూటికి వస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో గన్నవరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు పద్మశ్రీ. కానీ షర్మిల తో ఉన్న విభేదాలతో ఆమెకు టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆమెను వైసీపీలోకి రప్పించి గన్నవరం ఇన్చార్జిగా ప్రకటిస్తారని ప్రచారం నడుస్తోంది. త్వరలో ఆమె వైసీపీలో చేరుతారని.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.